TG: పంచాయతీరాజ్ శాఖలో చిత్ర విచిత్రాలు.. బదిలీలు.. పోస్టింగులు.. సందేహాలు!!

by Gantepaka Srikanth |

ఇటీవల గ్రూప్-1 అభ్యర్థులకు ఎంపీడీవోలుగా పోస్టింగ్, జాయినింగ్, ట్రైనింగ్ విషయంలో పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి.

TG: పంచాయతీరాజ్ శాఖలో చిత్ర విచిత్రాలు.. బదిలీలు.. పోస్టింగులు.. సందేహాలు!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల గ్రూప్-1 అభ్యర్థులకు ఎంపీడీవోలుగా పోస్టింగ్, జాయినింగ్, ట్రైనింగ్ విషయంలో పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. డిపార్ట్ మెంట్ తీరు చిత్రవిచిత్రంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా ఎంపీడీవోగా ఉద్యోగంలో చేరే వారు.. ఆయా హెచ్వోడీలు, అక్కడి నుంచి కలెక్టర్ల వద్దకు వెళ్లాలి. జిల్లాల్లో రిపోర్టింగ్ చేశాక.. మండలాల పోస్టింగ్ కలెక్టర్ ఇస్తారు. అయితే కొత్తగా ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వాలనే హడావుడిలో ఉన్నతాధికారులు రాజేంద్రనగర్ లోని పంచాయతీరాజ్ శిక్షణా సంస్థలోని కార్యాలయానికే జిల్లా పరిషత్ అధికారులను పిలిపించుకుంటున్నారు. సోమవారం ఉదయం 9.30 కల్లా జిల్లా పరిషత్ అధికారులే వచ్చి రాజేంద్రనగర్ లోని శిక్షణా కేంద్రంలో జాయిన్ అయి, వెంటనే రీలివ్ అయినట్లుగా రెండు ఆర్డర్స్ ఇవ్వాలని కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. దీంతో జిల్లాల్లోని జెడ్పీ అధికారులు హడావుడిగా రాజేంద్రనగర్ బయలుదేరారు.

అన్ని ‘ఆర్డర్లు’ ఒకే చోట..!

ఒక మండలంలో ఎంపీడీవో పోస్టు ఖాళీగా ఉంటే.. ఇప్పటి వరకు ఉన్న ఇన్ చార్జి అధికారిని రీలివ్ చేసినట్లుగా ఆదివారం ఆర్డర్ ఇవ్వాలి. సోమవారం గ్రూప్-1 ఎంపీడీవోకు కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చినట్లుగా ఆర్డర్ ఇవ్వాలి. వెంటనే ఆ మండలంలో ఆ అధికారిని జాయిన్ చేసుకున్నట్లుగా జెడ్పీ సీఈవో ఆర్డర్ ఇవ్వాలి. ఆ తర్వాత శిక్షణ కోసం వెళ్తున్నారు కాబట్టి.. కొత్త ఎంపీడీవోను రిలీవ్ చేసినట్లుగా మరొక ఆర్డర్ ఇవ్వాలి. ఆ మండలంలో మరొకరికి ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించాలి. అయితే ఇవన్నీ పేపర్ మీద రాజేంద్రనగర్ లోని టీఎస్ఐఆర్డీలో జరగాలని ఆదేశాలు ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ఎంపీడీవోలుగా ఎంపికైన వారు.. వారికి కేటాయించిన జిల్లాకు వెళ్లి కలెక్టర్కు రిపోర్ట్ చేస్తే.. ఆయన వారికి మండలం కేటాయిస్తారు. ఆ మండలానికి వెళ్లి అక్కడ అప్పటికే ఉన్న అధికారి ద్వారా వారు బాధ్యతలు స్వీకరించాలి. ఆ తర్వాత ట్రైనింగ్ వెళ్తున్నారు కాబట్టి.. మరొక అధికారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్ కావాలి. ఇవేమీ జరగకుండా కొత్త ఎంపీడీవోలకు శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ దగ్గరికే జిల్లా పరిషత్ అధికారులను రావాలని చెప్పడం సరికొత్త గా ఉందని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఒక వ్యక్తిని చూడకుండానే కలెక్టర్ పోస్టింగ్ ఇవ్వడం, మండలానికి రాకుండానే జాయిన్ కావడం, రిలీవ్ కావడం ఏదైతే ఉందో పంచాయతీరాజ్ శాఖకు సరికొత్త నిర్వచానాన్ని ఇచ్చిందని చెబుతున్నారు.

బదిలీలు.. పోస్టింగులు.. సందేహాలు

– ఎంపీడీఓ గ్రూప్-1 ద్వారా భర్తీ చేసే పోస్టు. దీనిలో భాగంగా 131 మంది ఎంపికయ్యారు. మరో తొమ్మిది మంది రిపోర్ట్ చేయలేదని సమాచారం. వీరిలో మల్టీజోన్-1కు 77 మంది, మల్టీ జోన్-2కు 54 మందిని కేటాయించారు. వీటిలో హన్మకొండ, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు ఎవరినీ కేటాయించలేదు. భువనగిరి జిల్లాలో ఖాళీలు లేవు. ముఖ్యమైన జిల్లాల్లో ఉన్న మండలాలకు పోస్టింగ్ ఇవ్వకపోవడం వెనక మతలబు ఏమిటనే ప్రశ్న కూడాఉత్పన్నం అవుతున్నది.

–అసెంబ్లీ ఎన్నికల సమయంలో బదిలీ చేసిన పలువురు ఎంపీడీవోలను సొంత జిల్లాలకు పోస్టింగ్ ఇచ్చారు. తాజాగా జి.విజయలక్ష్మిని వికారాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాకు, కే.ఉమాదేవిని గద్వాల నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు, ధనుంజయ్ గౌడ్ ను నారాయణపేట నుంచి మహబూబ్ నగర్ కు బదిలీ చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

-మల్టీజోన్-1లో పి.రామకృష్ణ, పి.సుమణవాణి ఇద్దరిని ములుగు నుంచి హన్మకొండ జిల్లాకు, ఏ,శ్రీనివాస్ రెడ్డి, రావురి పద్మావతిని జగిత్యాల నుంచి కరీంనగర్ జిల్లాకు, రాజీవ్ మల్హోత్రను సిరిసిల్ల నుంచి కరీంనగర్కు బదిలీ చేశారు. దీంతో హన్మకొండ, కరీంనగర్లో ఉన్న ఖాళీలు భర్తీ అయ్యాయి.

Next Story