జేఎన్ఏఎఫ్ యూ‌పీహెచ్‌డీలో విచిత్ర పరిస్థితి.. పీహెచ్‌డీలు లేనివారికి పదవులపై విమర్శలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-20 00:31:04  IST  )

రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది.

జేఎన్ఏఎఫ్ యూ‌పీహెచ్‌డీలో విచిత్ర పరిస్థితి.. పీహెచ్‌డీలు లేనివారికి పదవులపై విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఉన్నత విద్యా ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన కీలకస్థానాల్లో పీహెచ్‌డీ అర్హత లేని వారే తిష్ట వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పరిశోధన విభాగమైన పీహెచ్‌డీ ప్రవేశాల కమిటీ నియామకంలో యూజీసీ నిబంధనలను తుంగలో తొక్కారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పీహెచ్‌డీ లేనివారే పీహెచ్‌డీ నిర్ణేతలా

యూనివర్శిటీ తాజాగా ఏర్పాటు చేసిన పీహెచ్‌డీ ప్రవేశస్థాయి కమిటీకి పీహెచ్‌డీ లేని వ్యక్తి చైర్మన్‌గా వ్యవహరిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా, ఈ కమిటీకి కన్వీనర్‌గా ఉన్న డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్‌కు కూడా పీహెచ్‌డీ అర్హత లేదని తెలుస్తోంది. ఈ కమిటీలో ఉన్నవారిలో ఇద్దరికి మాత్రమే పీహెచ్‌డీ పట్టాలు ఉన్నాయనేది అధికారిక వర్గాల సమాచారంగా తెలుస్తోంది. కమిటీలో ప్రధాన నిర్ణయాధికారం ఉన్న డైరెక్టర్ అడ్మిషన్స్, డైరెక్టర్ అకాడమిక్ అండ్ ప్లానింగ్, రిజిస్ట్రార్, ఇంచార్జి వీసీలకు పీహెచ్‌డీ పట్టాలు లేవు. అత్యున్నత స్థాయి పరిశోధనల కోసం నిబంధనలు రూపొందించాల్సిన వారికే ఆ స్థాయి డిగ్రీ లేకపోవడంపై విద్యావేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలో ప్రిన్సిపల్ సీఎఫ్ఏ, ప్రిన్సిపల్ ఎస్పీఏ‌లకు సైతం పీహెచ్‌డీ లేకపోయినా ప్రిన్సిపాల్స్‌గా కొనసాగుతున్నారు. అసలు పీహెచ్‌డీ లేని వారు, పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకాలు ఎలా నిర్దేశిస్తారని పలువురు ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు.

యూజీసీ నిబంధనల ఉల్లంఘన

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఉన్నత విద్యాశాఖ నిబంధనల ప్రకారం.. పీహెచ్‌డీ వంటి అత్యున్నత విద్యా కోర్సుల నియమ నిబంధనలను రూపొందించే వారు లేదా పర్యవేక్షించే వారు తప్పనిసరిగా ఆ స్థాయి విద్యార్హతను కలిగి ఉండాలనే నిబంధన ఉంది. పీహెచ్‌డీ లేని వ్యక్తులు, ఆ కోర్సు లోతును, పరిశోధనా ప్రమాణాలను ఎలా నిర్ధారిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి నియామకాల వల్ల పీహెచ్‌డీ ప్రవేశాల పారదర్శకత దెబ్బతింటుందని, ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందని పలువురు విద్యావేత్తలు, ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలోని మరే ఇతర యూనివర్సిటీలోనూ ఇలాంటి దుస్థితి లేదని, కేవలం జేఎన్‌ఏఎఫ్‌ఏయూలోనే ఈ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.

మేల్కోని ఉన్నతాధికారులు..

ఉన్నత విద్యా రంగంలో పీహెచ్‌డీ డిగ్రీ అనేది అత్యంత కీలకమైనది. అటువంటి ప్రవేశాల కమిటీలోనే అర్హత లేని వారు ఉండటం జేఎన్‌ఏఎఫ్‌ఏయూ పరిపాలనా తీరుపై విమర్శలకు తావిస్తోంది. ఉన్నత విద్యా మండలి, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, యూజీసీ నిబంధనలకు లోబడి కమిటీని పునర్వ్యవస్థీకరించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. యూనివర్శిటీలో నిబంధనలకు విరుద్దంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శికి, సాంకేతిక విద్యా కమిషన్, తెలంగాణ ఉన్నత విద్యామండలికి గతంలోనే భారీ ఎత్తున ఫిర్యాదులు అందాయి. జేఎన్ఏఎఫ్ యూ ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్ అక్రమ పద్ధతుల్లో పదోన్నతులను కల్పిస్తున్నారని కంప్లైంట్ చేస్తున్నారు. నకిలీ పత్రాలతో పదోన్నతులు కల్పిస్తూ, అర్హత లేని వారికి కూడా కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ కింద లబ్ధి చేకూరుస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Next Story