Office: దయచేసి కాళ్లు మొక్కరాదు.. కార్యాలయంలో విచిత్ర పోస్టర్ వైరల్

by Ramesh Naini |

కొంత మంది తమ అభిమాన నటులు, రాజకీయ నాయకులు, అధికారులు, సెలబ్రిటీల కాళ్లు మొక్కుతుంటారు.

Office: దయచేసి కాళ్లు మొక్కరాదు.. కార్యాలయంలో విచిత్ర పోస్టర్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో గురువు, పెద్దలు, తల్లిదండ్రులు కాళ్లు మొక్కడం సంప్రదాయం. అయితే కొంత మంది తమ అభిమాన నటులు, రాజకీయ నాయకులు, అధికారులు, సెలబ్రిటీల కాళ్లు మొక్కుతుంటారు. తన వయసులో చిన్నవాడైన కూడా కొంత మంది తను అభిమానించే నాయకుడి కాళ్లు మొక్కుతారు. ఈ క్రమంలోనే ఓ బీఆర్ఎస్ కార్యాలయంలో ఒక విచిత్ర పోస్టర్ (poster) నెట్టింట వైరల్‌గా మారింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి బీఆర్ఎస్ (BRS) పార్టీ కార్యాలయంలో విచిత్ర పోస్టర్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్ వీడియో పోస్ట్ చేశారు. ఆ పోస్టర్‌లో ‘దయచేసి కాళ్లు మొక్కరాదు (దేవుళ్లు, తల్లదండ్రులు, గురువుల కాళ్లు మాత్రమే మొక్కాలి) అని రాసి ఉంది. పోస్టర్ పక్కనే ఫ్లెక్సీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఫోటో ఉండటం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది. పోస్టర్ ఏర్పాటుపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మంచి మెసేజ్ ఇచ్చారని నెటిజన్లు కొనియాడారు.

ఆ బీఆర్ఎస్ కార్యాలయంలో ఇంకో పోస్టర్ కూడా ఉంటుందని, సన్మానాలు బొకేలు, శాలువలు తీసుకురావద్దని, బుక్కులు, పెన్నులు మాత్రమే తీసుకుని రావాలి.. అని రాసి ఉంటుందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. అక్కడ కరెక్ట్ గానే రాశారని, కాళ్లు మొక్కాలి అనే ఆలోచన లేని వారికి కూడా.. ఓ హో కాళ్లు మొక్కాలేమో అనుకునే విధంగా పోస్టర్ ఏర్పాటు చేశారని ఓ నెటిజన్ ఆసక్తికర కామెంట్ పెట్టారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి తాాజాగా కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో తన నివాసం పక్కనే నూతన జాగృతి కార్యాలయం ఓపెన్ చేశారు. ఇవాళ (శనివారం) సాయంత్రం 4 గంటలకు కొత్త కార్యాలయాన్ని కవిత ప్రారంభించనున్నారు.

Next Story