కర్ణాటక సర్కార్ కుట్రలు ఆపండి.. ఎమ్మెల్సీ కవిత సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-20 06:55:39  IST  )

కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు కుట్రలు చేస్తోందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సంచలన ఆరోపణలు చేశారు.

కర్ణాటక సర్కార్ కుట్రలు ఆపండి.. ఎమ్మెల్సీ కవిత సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు కుట్రలు చేస్తోందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ బంజారా‌హిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆల్మట్టి ఎత్తు పెంచుకుండా నాటి ప్రభుత్వాలు సుప్రీ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం ఆ స్టేను ఉల్లంఘిస్తూ.. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపునకు 1.70 లక్షల ఎకరాల భూ సేకరణ చేసేందుకు 70 వేల కోట్ల నిధులు విడుదలకు నిర్ణయం తీసుకుందని అన్నారు. ఆ నిర్ణయంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారని తెలిపారు. డ్యామ్ ఎత్తు 5 మీ. ఎత్తు పెంచితే.. 100 టీఎంసీ నీటి నిల్వతో మహారాష్ట్రలో రెండు జిల్లాలు మునిగిపోతాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. త్వరలోనే సుప్రీం కోర్టుకు కూడా పోతామని చెప్పారని అన్నారు. ఈ వారంలోనే కృష్ణా ట్రైబ్యూనల్ హియరింగ్ ఉందని.. ఆ సమాశానికి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల రాష్ట్రానికి జరుగుతోన్న నష్టాన్ని కృష్ణా ట్రైబ్యూనల్ అధికారులకు వివరించాలని కవిత డిమాండ్ చేశారు.

రేవంత్ సర్కార్ మౌనం ఎందుకు..

ఒక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే.. తెలంగాణ కృష్ణా పరివాహక ప్రాంతం ఎడారిలా మారి క్రికెట్ ఆడుకునుడు తప్ప చేసిదేం లేదని కవిత అన్నారు. ఇప్పటికే నారాయణ్ పూర్ దాటి ఆల్మట్టి దాటి కృష్ణా నీరు తెలంగాణకు చేరడానికి ఆగస్టు దాటుతోందని అన్నారు. ఎగువ రాష్ట్రాల్లో బీభత్సంగా వర్షాలు పడితే తప్ప వరద నీరు రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇక ఆల్మట్టి 5 మీటర్లు పెంచితే.. కృష్ణానది కనమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి‌లకు అర్థం అవుతుందా.. లేదా అని ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రజలు కృష్ణా జలాలపై ఏళ్లకు ఏళ్లుగా పోరాటాలు చేశారని.. కానీ ప్రస్తుతం ఎందుకు మౌనంగా ఉంటోందని వారు తమను ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

పాలమూరు మీద సీఎంకు ప్రేమే లేదు..

తెలంగాణ ఉద్యమ సమయంలో స్వయంగా తాను కూడా కర్ణాటక భూభాగంలోకి వెళ్లి ఆల్మట్టి డ్యామ్ వద్ద పరిశీలన చేశానని కవిత అన్నారు. నాడు హైదరాబాద్ స్టేట్‌లో నిజాం ఆర్డీఎస్ ప్రాజెక్ట్ కట్టడానికి కర్ణాటకలో భూమి తీసుకుని పెట్టారని గుర్తు చేశారు. కానీ, గత 10, 12 ఏళ్లలో ఆర్డీఎస్ ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకోలేకపోయామని అన్నారు. దాని బదులు గద్వాలలో తుమ్మిళ్ల, డిండి, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నా అన్ని అసంపూర్తిగానే ఉన్నాయని తెలిపారు. పాలమూరు పులిబిడ్డను అని చెప్పుకుని రేవంత్ రెడ్డి కూడా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఒక్క పైసా నిధులు మంజూరు చేయడం లేదని.. ఇక్కడే ఆయనకు పాలమూరు మీద ప్రేమ లేదనే విషయం స్పష్టం అవుతోందని ఆరోపించారు. కృష్ణా నది నీళ్లపై కర్ణాటక కుట్రలు చేస్తోంటే.. ప్రభుత్వం మాట్లాడని ఆసహాయ స్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర రైంతాగాన్ని కాపాడేందుకు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచొద్దని కాంగ్రెస్‌‌కు సుప్రీంల భావించే సోనియా గాంధీతో సీఎం సిద్ధరామయ్యకు రేవంత్ రెడ్డి ఓ ఫోన్ కాల్ చేయించాలని కవిత డిమాడ్ చేశారు.

సుప్రీం కోర్టుకు వెళ్లాలన్నా పట్టించుకోవట్లే..

విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్-1‌పై సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్‌‌తో పాటు సుప్రీం కోర్టుకు వెళ్తున్నారని మండిపడ్డారు. తద్వారా రాష్ట్రంలో భవిష్యత్తులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లు వేయడం ఆగిపోతాయనే ఆలోచన చేస్తున్నారని కవిత ఫైర్ అయ్యారు. కానీ, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉందని.. ఆ విషయంపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలని చెప్పినా పట్టించేకోవడం లేదని కవిత ఆరోపించారు.

Read More: నాతో టచ్‌లో ఉన్న BRS నేతల లిస్ట్ పెద్దదే.. మరో బాంబు పేల్చిన ఎమ్మెల్సీ కవిత

Next Story