యథేచ్ఛగా శ్రమ దోపిడీ.. మెడికల్ కాలేజీల్లో ‘స్టైఫండ్’ దగా

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో వైద్య విద్యార్థుల శ్రమదోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. పగలు, రాత్రి తేడా లేకుండా రోగులకు సేవలందిస్తున్న హౌస్ సర్జన్లు (యూజీ), పీజీ విద్యార్థులకు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన స్టైఫండ్ ను యాజమాన్యాలు ఎగ్గొడుతున్నాయి.

యథేచ్ఛగా శ్రమ దోపిడీ.. మెడికల్ కాలేజీల్లో ‘స్టైఫండ్’ దగా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో వైద్య విద్యార్థుల శ్రమదోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. పగలు, రాత్రి తేడా లేకుండా రోగులకు సేవలందిస్తున్న హౌస్ సర్జన్లు (యూజీ), పీజీ విద్యార్థులకు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన స్టైఫండ్ ను యాజమాన్యాలు ఎగ్గొడుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన మొత్తంలో కనీసం పదో వంతు కూడా చెల్లించడం లేదని, కొన్ని కళాశాలలైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సిటిజన్ ఫోరం (హెచ్‌సీఎఫ్‌), అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం (యూడీఎఫ్‌) ఆర్టీఐ ద్వారా సేకరించిన సంచలన విషయాలను బయటపెట్టాయి.

నామమాత్రపు చెల్లింపులు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం హౌస్ సర్జన్స్‌ కు నెలకు రూ. 25,906 స్టైఫండ్ చెల్లించాలి. కానీ, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అనేక ప్రైవేట్ కళాశాలలు కేవలం రూ. రెండు వేల నుంచి ఐదువేలు మాత్రమే చెల్లిస్తున్నాయి. కొన్ని కాలేజీలు అసలు స్టైఫండే ఇవ్వడం లేదు. ఇక పీజీ విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ. 58,289 స్టైఫండ్ ను సగానికి పైగా కాలేజీలు ఎగ్గొడుతున్నాయి. కాగితాల్లో మాత్రం అంతా సవ్యంగానే ఉన్నట్లు చూపిస్తూ, ఎన్‌ఎంసీకి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని ఫోరం ప్రతినిధులు ఆరోపించారు. 2024-25లో చెల్లింపులపై ఎన్‌ఎంసీ నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. కామినేని (నార్కెట్‌పల్లి, హైదరాబాద్), సురభి (సిద్దిపేట), పట్నం మహేందర్ రెడ్డి (చేవెళ్ల), అయాన్ (రంగారెడ్డి), మల్లారెడ్డి, డా. వి.ఆర్.కె., షాదాన్ ఇన్‌స్టిట్యూట్స్ ఒక్క రూపాయి కూడా స్టైఫండ్స్ చెల్లించకుండా విద్యార్థులతో గంటలు గంటలు చాకిరీ చేయించుకుంటున్నట్లు తేలింది. ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజ్ (రూ. 2,080), భాస్కర (రూ. 2,000), మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం (రూ. 2,000) నామమాత్రపు చెల్లింపులు చేస్తున్నాయి. అపోలో, మెడిసిటీ, చల్మెడా ఆనంద్‌రావు మెడికల్ కాలేజీలు రూ. 5,000 చొప్పున మాత్రమే చెల్లిస్తున్నట్లు వెల్లడైంది.

పెంపు జీవోలు కాగితాలకే పరిమితం

రాష్ట్ర ప్రభుత్వం 2025 జూన్‌లో వైద్య విద్యార్థుల స్టైఫండ్ ను 15శాతం పెంచింది. దీని ప్రకారం హౌస్ సర్జన్లకు రూ. 29,792, పీజీ విద్యార్థులకు (మొదటి సంవత్సరం) రూ. 67,032 చెల్లించాలి. పాత బకాయిలే చెల్లించని యాజమాన్యాలు, పెరిగిన మొత్తాన్ని అమలు చేయడం అసాధ్యమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టైఫండ్ చెల్లింపులను పర్యవేక్షించాల్సిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు తమ బాధ్యత కాదంటూ తప్పించుకుంటున్నారని హెచ్‌సీఎఫ్‌, యూడీఎఫ్ సభ్యులు చెబుతున్నారు. ఆర్టీఐలో అడిగిన ప్రశ్నలకు ‘కాలేజీ ప్రిన్సిపల్స్‌ ను అడగండి’ అని సమాధానం ఇవ్వడం వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెడుతున్నదని చెబుతున్నారు. ఫీజుల దోపిడీపై ప్రభుత్వం వేసిన స్పెషల్ కమిటీ పరిధిలోకి ఈ స్టైఫండ్ అంశాన్ని కూడా చేర్చి విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

స్పెషల్ కమిటీతో విచారణ జరిపించాలి

- ఎం. శ్రీనివాస్, కన్వీనర్, అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం

ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యార్థుల శ్రమకు తగ్గ ఫలితం అందించడం లేదు. ఫీజుల విషయంలో ప్రభుత్వం ఎలాగైతే స్పెషల్ కమిటీని వేసిందో, అదే కమిటీతో స్టైఫండ్ ఎగవేతపైనా సమగ్ర విచారణ జరిపించాలి. స్టైఫండ్ చెల్లించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.

ఎన్‌ఎంసీకి తప్పుడు లెక్కలు

- ఎం. శ్రీనివాస్‌రావు, అధ్యక్షులు, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం

ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వైద్య విద్యార్థులకు రూ. 25 వేలు ఇవ్వాల్సిన చోట రూ. 2 వేలు ఇస్తున్నాయి. అంతేకాకుండా అంతా సక్రమంగానే ఉందని ఎన్‌ఎంసీకి తప్పుడు నివేదికలు పంపిస్తున్నాయి. ఈ గణాంకాలు మేం సృష్టించినవి కావు. సాక్ష్యాత్తు ఎన్‌ఎంసీ రికార్డుల్లో ఉన్నవే. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి.

అధికారుల బాధ్యాతరాహిత్యం

- వీరయ్య, ప్రధాన కార్యదర్శి, హెచ్‌సీఎఫ్‌

నియంత్రించాల్సిన అధికారులే ‘మాకు సంబంధం లేదు, ప్రిన్సిపల్‌ను అడగండి’ అని ఆర్టీఐలో సమాధానం ఇవ్వడం సిగ్గుచేటు. డీఎంఈ, కాళోజీ యూనివర్సిటీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి.

Next Story