- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలపై వేధింపులు చూస్తూ మౌనం వహిస్తే అదే నేరం.. డీజీ చారు సిన్హా హెచ్చరిక
మహిళలపై జరుగుతున్న వేధింపులను చూస్తూ మౌనంగా ఉండిపోవడం కూడా నేరమేనని, వారికి అండగా నిలబడటం ప్రతి పౌరుడి బాధ్యత అని చాటి చెబుతూ తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ చేపట్టిన స్టాండ్ విత్ హర్ ప్రచార కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళలపై జరుగుతున్న వేధింపులను చూస్తూ మౌనంగా ఉండిపోవడం కూడా నేరమేనని, వారికి అండగా నిలబడటం ప్రతి పౌరుడి బాధ్యత అని చాటి చెబుతూ తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ చేపట్టిన స్టాండ్ విత్ హర్ (Stand with her) ప్రచార కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. కేవలం కఠిన చట్టాలు, పోలీసుల నిఘాతోనే మహిళల భద్రత సాధ్యం కాదని, సమాజంలోని ప్రతి పురుషుడి ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే వారికి నిజమైన రక్షణ లభిస్తుంది.. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారు సిన్హా నేతృత్వంలో మొదలైన ఈ కార్యక్రమంలో మహిళల భద్రతలో పురుషులను సైతం క్రియాశీల భాగస్వాములను చేస్తూ ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు.
వైరల్ అవుతున్న ప్రచారం..
పోలీసులు ప్రారంభించిన ఈ డిజిటల్ క్యాంపెయిన్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సినీ తారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ మద్దతు తెలుపుతున్నారు. ప్రముఖ యువ హీరో అడివి శేష్ ఈ క్యాంపెయిన్‌లో భాగమవుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇంటర్నెట్ అనేది ఒక మహా సముద్రం లాంటిది. అందులో మహిళలపై వచ్చే ఆన్‌లైన్ వేధింపులు, అసభ్యకరమైన కామెంట్లు, ట్రోలింగ్ లాంటివి దానికి అంటుకున్న ఇసుక లాంటివి. ఆ ఇసుకను తుని చేయాల్సిన బాధ్యత ప్రతి మగాడిపైనా ఉంది’ అని ఆయన తెలిపారు. అలాగే పురుషులు కేవలం మూగ ప్రేక్షకులుగా ఉండిపోకుండా, బాధ్యతాయుతమైన పౌరులుగా గళం విప్పాలని, అడుగడుగునా మహిళలకు భరోసా ఇచ్చేలా ప్రవర్తించాలని ఇన్‌ఫ్లుయెన్సర్లు విరాజిత, దీపక్ కరముంగికర్, శరత్ నిషా నల్ల, చిల్లర్ బాయ్ తదితరులు తమ వీడియోల ద్వారా ఈ సందేశాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఒక మహిళ ఫోటో లేదా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసే ముందు ఆమె అనుమతి తీసుకోవడం కేవలం మర్యాద మాత్రమే కాదని, అది ఆమె ప్రాథమిక హక్కు అని వారు చెబుతూ మద్దతు తెలుపుతున్నారు.
మన ఇంట్లో ఎలాగైతే.. బయటా అలాగే : డీజీ చారు సిన్హా
ఇళ్లు, ఆఫీసులు అనే తేడా లేకుండా మహిళల పట్ల ప్రతి చోటా గౌరవంగా మెదలాలని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారు సిన్హా సూచించారు. ఆడవారి రూపంపై బాడీ షేమింగ్ చేయడం, వృత్తిపరమైన విజయాలను ఎగతాళి చేయడం, పెళ్లికి సంబంధించిన విషయాల్లో చులకనగా మాట్లాడడం వంటివి తక్షణమే మానుకోవాలన్నారు. మహిళలకు ఏదైనా వేధింపులు ఎదురైనప్పుడు చూస్తూ ఉండిపోవడం అంటే, పరోక్షంగా ఆ తప్పుకు మద్దతు ఇచ్చినట్లే.. మహిళల భద్రత అంటే కేవలం రోడ్లమీద పోలీసుల సంఖ్యను పెంచడం కాదు.. సమాజం ఆలోచించే తీరును సమూలంగా మార్చడం అన్నారు. మన ఇంట్లోని మహిళలకు మనం ఎలాంటి గౌరవం ఇస్తామో, బయట మహిళల పట్ల కూడా అదే గౌరవం చూపించాలని చెప్పారు. ఈ మార్పు మన ఇంటి నుంచే మొదలైనప్పుడే సమాజంలో సురక్షిత వాతావరణం ఏర్పడుతుందన్నారు. మీ కళ్లెదుట ఏదైనా తప్పు జరుగుతుంటే మౌన ప్రేక్షకుల్లా ఉండిపోకండి.. నోరు విప్పండి, ప్రశ్నించండి.. ఈ సామాజిక మార్పులో ప్రతి మగాడి పాత్ర ఎంతో ముఖ్యం.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రత, వారి గౌరవాన్ని కాపాడేందుకు తమ విభాగం నిరంతరం కృషి చేస్తోంది.. అని డీజీ చారు సిన్హా పేర్కొన్నారు.






