- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టిమ్స్ చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర పాలిటిక్స్
తాము అధికారంలో ఉన్నన్నాళ్లు పెద్దగా పట్టించుకోని గత ప్రభుత్వంలోని పెద్దలు ఇప్పుడు ఉన్నపళంగా టిమ్స్(తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)పై పడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తాము అధికారంలో ఉన్నన్నాళ్లు పెద్దగా పట్టించుకోని గత ప్రభుత్వంలోని పెద్దలు ఇప్పుడు ఉన్నపళంగా టిమ్స్(తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)పై పడ్డారు. తమ ప్రభుత్వం ఉండి ఉంటే.. ఇప్పటికే టిమ్స్ పూర్తయ్యేవని.. కేసీఆర్ తీసుకొచ్చిన మంచి పనులు ఆపాలనే ఆలోచనలో సీఎం ఉన్నారని ఆరోపించారు. ఆరు నెలల్లోపు టిమ్స్ ఆస్పత్రి నిర్మాణాలు పూర్తి చేయాలని.. లేదంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అయితే సనత్ నగర్ టిమ్స్‌ను త్వరలో ప్రారంభించేందుకు సర్కారు ఓ వైపు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ టిమ్స్ పనుల పురోగతిపై లెక్కకు మించి సమీక్షలు నిర్వహించారు. సనత్‌నగర్, కొత్తపేట్, అల్వాల్ టిమ్స్ హాస్పిటళ్లను కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
చివరిసారిగా గత నెల 30వ తేదీన ఆయన అధికారులతో ఇదే అంశంపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సహజంగానే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వం మొదలుపెట్టి వదిలేసిన టిమ్స్‌ను ప్రస్తుత ప్రభుత్వం శ్రద్ధతో పూర్తి చేస్తోంటే పైపెచ్చు హరీశ్‌రావు వ్యవహారం ప్రభుత్వ పెద్దలకు కూడా ఆగ్రహం తెప్పించినట్లుగా సమాచారం. మరో వైపు డిసెంబర్ చివరి నాటికి టిమ్స్ ప్రారంభించేందుకు అంతా సిద్ధమైన వేళ మాజీ మంత్రి హరీశ్‌రావు.. 6 నెలల్లో ప్రారంభించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించడం చూస్తే.. తమ ఆందోళనకు దిగి వచ్చి సర్కారు టిమ్స్ హాస్పిటల్స్‌ను ప్రారంభించిందని క్రెడిట్ కొట్టేసే ఉద్దేశమే కనిపిస్తోందని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
కార్పొరేట్ స్థాయి కంటే మెరుగ్గా..
కార్పొరేట్ హాస్పిటళ్లలో క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాలు పనిచేస్తున్న విధానం, డాక్టర్లు, సిబ్బంది సంఖ్య, పెడుతున్న ఖర్చు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. కార్పొరేట్ హాస్పిటల్స్‌కు దీటుగా, నిమ్స్ కంటే మెరుగైన హాస్పిటళ్లను ప్రజలకు అందించాలని ప్రయత్నిస్తోంది. అందుకు టిమ్స్‌ను వేదికగా మార్చాలన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనగా అధికారులు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా అన్నిరకాల వసతులతో హాస్పిటళ్లు ఉండేలా, అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కార్పొరేట్ హాస్పిటళ్ల తరహాలో క్లినికల్ సర్వీసెస్, అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, అకడమిక్స్ విభాగాలు వేర్వేరుగా ఉండేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
నిమ్స్ తరహాలో మెడికల్ డైరెక్టర్, మెడికల్ సూపరింటెండెంట్‌తోపాటుగా చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ కూడా కొత్త టిమ్స్ హాస్పిటల్స్‌కు ఉండనున్నారు. ఏయే విభాగానికి ఎవరు బాధ్యులు, ఎవరి పని ఏంటి అన్నదానిపై స్పష్టమైన జాబ్‌చార్ట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో ధనవంతులు, పెద్ద పెద్ద నాయకులు కూడా చికిత్స కోసం గాంధీ ఆస్పత్రి, ఉస్మానియాకు వెళ్లేవారని, ఇప్పుడు టిమ్స్‌లను ఆ స్థాయిలో తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వం ప్లాన్. డాక్టర్లు, సిబ్బంది నియామకం, తదితర పూర్తి అంశాలతో త్వరలో తుది నివేదికను తయారు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.






