Damodar Rajanarsimha: పేద రోగులకు గొప్ప వరం

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో ఏటా 60 వేల కొత్త క్యాన్సర్ కేసులు నమోదు ఎంతో ఆందోళనకరమని.... అందుకే ఇకపై కేన్సర్‌ను రాష్ట్రంలో నోటిఫైబుల్ డిసీజ్ గా ప్రకటిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ప్రకటన చేశారు.

Damodar Rajanarsimha: పేద రోగులకు గొప్ప వరం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఏటా 60 వేల కొత్త క్యాన్సర్ కేసులు నమోదు ఎంతో ఆందోళనకరమని.... అందుకే ఇకపై కేన్సర్‌ను రాష్ట్రంలో నోటిఫైబుల్ డిసీజ్ గా ప్రకటిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ప్రకటన చేశారు. మంగళవారం నిమ్స్ క్యాన్సర్ బ్లాక్‌లో రూ. 33 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక లీనియర్ యాక్సిలరేటర్ (లినాక్) సేవలను ఆయన ప్రారంభించారు. వ్యాధి తీవ్రతను ముందే పసిగట్టేందుకు ప్రతి కేసును ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసేలా నిబంధనలు తీసుకువస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. కేన్సర్ రిజిస్ట్రీ ద్వారా ఖచ్చితమైన డేటాను సేకరించి, భవిష్యత్తులో మెరుగైన వైద్య ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ట్యూమర్‌ను మాత్రమే దెబ్బతీస్తూ ఆరోగ్యకరమైన కణాలను కాపాడే లినాక్ సేవలు నిమ్స్‌లో అందుబాటులోకి రావడం పేద రోగులకు గొప్ప వరంగా ఆయన అభివర్ణించారు. అనంతరం మహిళల క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించిన మంత్రి... గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్పీవీ టీకా అందించే కార్యక్రమంపై అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసే దిశగా చేపట్టిన ఈ చర్యలను అభినందించారు.

అసలు ఏమిటీ లినాక్...

లీనియర్ యాక్సిలరేటర్ అనేది క్యాన్సర్ గడ్డలను తొలగించడానికి వాడే ఒక అత్యాధునిక రేడియేషన్ టెక్నాలజీ. సాధారణ రేడియేషన్‌లో చుట్టుపక్కల ఉండే మంచి కణాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ, ఈ లినాక్ (ట్రూ బీమ్) సిస్టమ్ కేవలం ట్యూమర్‌పై మాత్రమే హై-ఎనర్జీ ఎక్స్‌-రేలను ప్రయోగిస్తుంది. ఈ యంత్రంతో చాలా తక్కువ సమయంలోనే ట్రీట్‌మెంట్ పూర్తవుతుంది. మెదడు, ఊపిరితిత్తులు వంటి సున్నితమైన భాగాల్లో ఉన్న కణతులను కూడా పక్కాగా నిర్మూలించవచ్చు. అపోలో, యశోద, బసవతారకం వంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇవి అందుబాటులో ఉన్నప్పటికీ, అక్కడ చికిత్స అత్యంత ఖరీదైనది.

Next Story