‘స్టేట్ ఇన్నోవేషన్ రిజిస్ట్రీ’ సర్వేతో పేదలకు ముప్పు: అసదుద్దీన్ ఒవైసీ

by Malleboina Mahesh |

ఎస్‌ఐఆర్ (SIR) సర్వేపై సీఎం రేవంత్‌కు అసదుద్దీన్ ఒవైసీ లేఖ.. దేశంలో 52% మందికి బర్త్ సర్టిఫికెట్లు లేవని, ముందుగా పేదలకు పీఆర్‌సీ (PRC) ఇవ్వాలని డిమాండ్!

‘స్టేట్ ఇన్నోవేషన్ రిజిస్ట్రీ’ సర్వేతో పేదలకు ముప్పు: అసదుద్దీన్ ఒవైసీ
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న ‘స్టేట్ ఇన్నోవేషన్ రిజిస్ట్రీ’ (SIR), సామాజిక సర్వేపై ఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సరైన ధృవీకరణ పత్రాలు (Documentation) లేకపోవడం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాస్తూ.. ఎస్‌ఐఆర్ సర్వేను ప్రారంభించే ముందే తెలంగాణలోని పేదలందరికీ శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలను (Permanent Residence Certificates - PRC) ఉచితంగా జారీ చేయాలని డిమాండ్ చేశారు.

52% మంది దగ్గర బర్త్ సర్టిఫికెట్లు లేవు

దేశంలోని పేదల వద్ద ప్రాథమిక పత్రాల కొరతను ఎత్తి చూడడానికి అసదుద్దీన్ ఒవైసీ ప్రముఖ థింక్ ట్యాంక్ ‘లోకనీతి-సిఎస్‌డీఎస్’ (Lokniti-CSDS), జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) గణాంకాలను ప్రస్తావించారు. "ఢిల్లీతో పాటు ఐదు రాష్ట్రాల్లో లోకనీతి సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. దేశంలో ఇప్పటికీ 52 శాతం మంది ప్రజల వద్ద పుట్టిన తేది ధృవీకరణ పత్రం (Birth Certificate) లేదు. అలాగే 41 శాతం మందికి నివాస ధృవీకరణ పత్రాలు (Domicile), 42 శాతం మందికి కుల ధృవీకరణ పత్రాలు (Caste Certificate) లేవు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం కేవలం సంపన్న వర్గాలలోని 82 శాతం మంది పిల్లలకే బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కఠినమైన డాక్యుమెంటేషన్‌తో సర్వేలు (SIR) నిర్వహిస్తే.. నిరక్షరాస్యులు, నిరుపేదలు, గిరిజన, దళిత. మైనారిటీ వర్గాల ప్రజలు రేషన్, ఫించన్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలను కోల్పోతారు" అని ఒవైసీ స్పష్టం చేశారు. అందువల్ల పేదల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం తక్షణమే పీఆర్‌సీ (PRC) డ్రైవ్‌ను చేపట్టాలని ఒవైసీ సీఎంకి రాసిన లేఖలో కోరారు.

Next Story