ఫీ‘జులుం’కు చెక్! ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం

by Ramesh Naini |

ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దందాకు ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. దీని కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తుంది.

ఫీ‘జులుం’కు చెక్! ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దందాకు ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. దీని కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 16 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది. అందులో ప్రధానంగా ప్రైవేటు స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణ కోసం ‘తెలంగాణ ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూల్స్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్’ ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ సిఫారసుల ఆధారంగా బిల్లును రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

మాఫియా ఆగడాలకు చెక్..

రాష్ట్రంలో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. సదుపాయాలు, ట్రైన్డ్ టీచర్లతో సంబంధం లేకుండా ప్రతి ఏటా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలైతే ఒక మాఫియాగా ఏర్పడి ప్రతిఏటా ఇష్టమొచ్చిన రీతిలో ఫీజులను పెంచుకుంటూ పోతుండగా.. మిగతా విద్యాసంస్థలు సైతం వాటినే అనుసరిస్తున్నాయి. ఈ అంశంపై పేరెంట్స్ పలుసార్లు ఆందోళనలు చేసినా.. ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఫీజులను నియంత్రించేందుకు బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమైంది. ‘సీఎం ఆదేశాల మేరకు బిల్లును తయారు చేసే పనిలో ఉన్నాం. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏదైన సాంకేతిక సమస్యలు వస్తే మాత్రం ఆ తరువాత సెషన్‌లో పెడతాం’ అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు.

విద్యా కమిషన్ సిఫారసుల మేరకు..

ప్రైవేటు స్కూల్స్ ఆగడాలను గమనించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఫీజుల నియంత్రణ కోసం చట్టాన్ని తీసుకొచ్చే విషయంలో సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే విద్యా కమిషన్ చేసిన సిఫారసులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మధ్య విద్యా శాఖపై సమీక్ష చేసిన సమయంలో ఫీజుల నియంత్రణ కోసం ‘రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్రెటరీ’ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా విద్యా కమిషన్ ఇచ్చిన సిఫార్సులపై పేరెంట్స్, మేధావులు, విద్యావేత్తలు, సామాజికవేత్తల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలని ఆదేశించడంతో విద్యాశాఖ అధికారులు జిల్లాల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.

చట్టం లేకపోవడంతో కోర్టుల్లో చిక్కులు..

ప్రస్తుతం ఇంజినీరింగ్ కాలేజీల ఫీజును ‘ఫీజు రెగ్యులరైజేషన్ కమిషన్’ సిఫారసుల మేరకు ఫైనల్ చేస్తున్నారు. కానీ, ప్రైవేటు స్కూల్స్‌లో వసూలు చేస్తున్న ఫీజును నిర్ధారించే అధికారం ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఎందుకంటే ఫీజులను నియంత్రించేందుకు చట్టం లేదు. దీంతో ఇప్పటివరకు ఫీజు నియంత్రణ కోసం విద్యాశాఖ జారీ చేసే జీవోలు కోర్టుల్లో నిలిచేవి కావు. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు స్కూల్స్ ఫీజుల నిర్ధారణ కోసం కమిషన్ ఏర్పాటు చేసి, దాని విధివిధానాలకు చట్టబద్ధత కల్పించేందుకు సిద్ధం అవుతున్నది. చట్టం అమల్లోకి వస్తే రానున్న రోజుల్లో ప్రైవేటు స్కూల్స్ ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేయలేవు. ప్రతి ఏటా ఫీజు నిర్ధారించే అధికారం కేవలం కమిషన్‌కు మాత్రమే ఉంటుంది. అందుకోసం ప్రతి స్కూల్ యాజమాన్యం పిల్లలకు అందిస్తున్న సదుపాయాలు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖర్చుల వివరాలను కమిషన్‌కు అందజేయాలి. ఆ వివరాలను పరిశీలించి, ఫీల్డ్ విజిట్ చేసిన తరువాతే కమిషన్ సంబంధిత స్కూల్ ఎంత ఫీజు వసూలు చేయవచ్చో నిర్ణయిస్తుంది.

Next Story