రాష్ట్ర బంద్ 18 వ తేదీకి వాయిదా.. తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ ఏర్పాటు.. చైర్మన్‌గా ఆర్‌. కృష్ణయ్య

by Ramesh Naini |   (  Updated:2025-10-12 14:38:42  IST  )

బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 14న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య తెలిపారు.

రాష్ట్ర బంద్ 18 వ తేదీకి వాయిదా.. తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ ఏర్పాటు.. చైర్మన్‌గా ఆర్‌. కృష్ణయ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 14న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) తెలిపారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో బీసీ సంఘాల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం (BC Reservations) బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ‘తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ’ (Telangana BC JAC) ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. బీసీల నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రంలో ఉద్యమం బలంగా జరిగితే.. కేంద్రంపై ప్రభావం పడుతుందన్నారు. 42 శాతం రిజర్వేషన్లలో ఏ అంశంపై హైకోర్టు స్టే ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత స్టే ఇవ్వకూడదని వివరించారు.

బీసీలకు న్యాయం కోసం ఈ నెల 18న బంద్‌కు పిలుపునిచ్చామని చెప్పారు. అన్యాయాన్ని 76 ఏళ్లుగా బీసీలు భరిస్తూ వస్తున్నామని, ఇప్పుడు అవమానం కూడా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో బిల్లు పెట్టే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. కాగా, బీసీ జేఏసీలో కీలక నేతలు ఆరుగురితో కమిటీ ఏర్పడింది. జేఏసీ చైర్మన్‌గా ఆర్. కృష్ణయ్య, వైస్‌ చైర్మన్‌గా వీజీ నారగోని, వర్కింగ్ చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్‌లుగా దాసు సురేశ్ రాజారామ్ యాదవ్‌లను ఎన్నుకున్నారు.

Next Story