ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రస్తావన : మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

రాష్ట్ర వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న సాంకేతికత, డిజిటల్ మౌలిక వసతులపై న్యూఢిల్లీ వేదికగా నిర్వహించిన ఏఐ సమ్మిట్​లో ప్రస్తావనకు రావడం గర్వకారణమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రస్తావన : మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న సాంకేతికత, డిజిటల్ మౌలిక వసతులపై న్యూఢిల్లీ వేదికగా నిర్వహించిన ఏఐ సమ్మిట్​లో ప్రస్తావనకు రావడం గర్వకారణమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ వ్యవసాయానికి సాంకేతికతను జోడించడంలో తెలంగాణ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టి ఆలోచనల మేరకు వ్యవసాయరంగంలో సాంకేతికత ఆధారిత సంస్కరణలు వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయరంగంలో పలు సాంకేతిక ఆధారిత కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని, రైతులకు సమయానికి ఎరువులు అందించేందుకు మొబైల్ యూరియా బుకింగ్ యాప్ ప్రవేశ పెట్టిందన్నారు. బ్లాక్ మార్కెటింగ్, అధిక నిల్వలను నియంత్రిస్తూ పారదర్శక పంపిణీ వ్యవస్థను తీసుకువచ్చిందని, శాటిలైట్ మ్యాపింగ్, ఉపగ్రహ ఆధారిత మట్టి విశ్లేషణ, ఐఓటీ సెన్సర్లు, పంట అంచనాలు, వాతావరణ ఆధారిత శాస్త్రీయ సలహా సేవలు వంటి ఆధునిక సాంకేతికతలను రాష్ట్రం విస్తృతంగా వినియోగిస్తోందన్నారు. శాటిలైట్ ద్వారా మట్టి పోషకాలను గుర్తించి, వాటిని ఏఐ మోడలింగ్ ద్వారా విశ్లేషించే పైలట్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.

తెలంగాణ అనుభవం.. ప్రపంచానికి మార్గదర్శకం

త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి, రైతులకు ఖచ్చితమైన మట్టి విశ్లేషణ పంటలకు తగిన శాస్త్రీయ సలహాలు అందించనున్నట్లు తెలిపారు. తెలంగాణ అనుభవం దేశానికి మాత్రమే కాక ప్రపంచానికి కూడా మార్గదర్శకమని, భవిష్యత్తులో సాంకేతికత ఆధారిత వ్యవసాయ సంస్కరణలలో రాష్ట్రం ముందుండి నాయకత్వం వహిస్తుందన్నారు. జర్మన్ అగ్రికల్చరల్ కౌన్సిలర్ సహా అంతర్జాతీయ నిపుణులు తెలంగాణలో అమలు చేస్తున్న సాంకేతిక విధానాలను ప్రశంసించడం విశేషమన్నారు. డిజిటల్ వ్యవసాయ విస్తరణలో ప్రమాణాలు, పరిపాలన వ్యవస్థ, రైతు-కేంద్రిత ఏఐ వినియోగంపై ప్రధానంగా చర్చించారు. రైతుల విభిన్న గుర్తింపు సంఖ్యలు, భూమి రికార్డుల అసమానతలు, వేర్వేరు వ్యవస్థల మధ్య అనుసంధానం లేకపోవడం, విడివిడిగా ఉన్న సలహా సేవలు వ్యవసాయ డిజిటలైజేషన్‌కు ఆటంకాలుగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో డిజిటల్ ఫామ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే సమగ్ర, ప్రమాణాల ఆధారిత, అంతరాయ రహిత వ్యవస్థ అవసరాన్ని ప్రస్తావించినట్లు వెల్లడించారు.

Next Story