నట్టేట ముంచేస్తున్న ‘స్టార్ హెల్త్’.. తీవ్ర ఆందోళనలో పాలసీదారులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-22 14:45:18  IST  )

వైద్య ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రజలు క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

నట్టేట ముంచేస్తున్న ‘స్టార్ హెల్త్’.. తీవ్ర ఆందోళనలో పాలసీదారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రజలు క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అత్యవసర సమయంలో ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా హాస్పిటల్ బిల్లులు భరించే అవకాశం ఉండటంతో పాలసీదారులు ఆర్థిక భారం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని భావించి వేలాది రూపాయలు చెల్లించి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో తక్షణ చికిత్స పొందే సౌకర్యం, పేపర్‌వర్క్ తగ్గింపు, అనుకోని ఖర్చుల భయం లేకపోవడం, కుటుంబ ఆర్థిక స్థితి కాపాడుకోవడం వంటి కారణాల వల్లే వీటి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది.

అయితే, ఇలాంటి వారి అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్.. పాలసీదారులకు మాత్రం సేవలు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతోంది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులు క్లెయిం చేసుకునే సమయంలో చికిత్సల ధరలను తగ్గించాలంటూ ఒత్తిడి చేయడం, డాక్టర్ల క్లినికిల్ నిర్ణయాలపై అసంబద్ధమైన ప్రశ్నలతో పాటు నగదు రహిత క్లెయింలకు ఆమోదం తెలిపి తుది బిల్లులో అడ్డమైన కోతలు విధించడం వంటి చర్యలతో పాటు నగదు రహిత చికిత్సలను అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడం చేస్తున్నట్లు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో క్యాష్ లెస్ చికిత్స కోసం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీదారులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీరు ఆది నుంచి ఇలాగే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టార్ హెల్త్ వ్యవహారంపై అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా (ఏ.హెచ్.పీ.ఐ) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. . ఈ సంస్థను నమ్మి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న అనేకమంది పాలసీదారులను మోసం చేస్తోందని ఏ.హెచ్.పీ.ఐ ఆరోపించింది. దీంతో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాలపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వైద్యవర్గాలు కోరుతున్నాయి. అనేక మంది పాలసీదారులు సైతం ఈ సంస్థ తీరుపై ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్టార్ ప్రతినిధులకు ఫోన్ చేసి తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. వెంటనే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.

స్టార్ హెల్త్ సేవలను రద్దు చేసే దిశలో AHPI

అక్రమ పద్ధతులను అవలంబిస్తోందని ఆరోపిస్తూ.. సంస్థకు సంబంధించిన క్యాష్ లెస్ సేవలను అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా (ఏ.హెచ్.పీ.ఐ) రద్దు చేసే అవకాశం ఉంది. ఇదే విషయంపై ఆసుపత్రుల సంఘం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 15,000కు పైగా ఆసుపత్రులకు ప్రాతినిధ్యం వహించే ఏ.హెచ్.పీ.ఐ.. స్టార్ హెల్త్ సంస్థతో సెప్టెంబర్ 22లోగా ఒక ఒప్పందం కుదరకపోతే, ఆ రోజు నుంచి పూర్తిగా స్టార్ హెల్త్ పాలసీదారులకు క్యాష్ లెస్ సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. గతంలో, బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఏ.హెచ్.పీ.ఐతో ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. అయితే చర్చల ద్వారా ఆ సమస్యలను పరిష్కరించుకున్నాయి. కానీ స్టార్ హెల్త్ తీరు మాత్రం సక్రమంగా లేదని ఏ.హెచ్.పీ.ఐ భావిస్తోంది. రోగులకు సరైన సేవలు అందించేందుకు ఆసుపత్రులు తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాయని... కానీ స్టార్ హెల్త్ లాంటి సంస్థల తీరు వల్ల రోగులు, ఆసుపత్రులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతోందని ఏ.హెచ్.పీ.ఐ చెబుతోంది.

టారిఫ్ సవరణకు అంగీకరించకపోవడంతో పాటు

ఏ.హెచ్.పీ.ఐ సభ్య ఆసుపత్రుల ఆరోపణల ప్రకారం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పాత టారిఫ్ లను సవరించడానికి నిరాకరిస్తోంది. రేట్లను మరింత తగ్గించమని ఆసుపత్రులపై ఒత్తిడి చేస్తోంది. ఏకపక్షంగా క్యాష్ లెస్ సేవలను నిరాకరిస్తోంది. ఇష్టానుసారంగా కోతలు విధిస్తోంది. తుది అనుమతి ఇచ్చిన తర్వాత కూడా క్లెయింలను తిరస్కరిస్తోంది. పోటీని అణచివేసేందుకు స్టార్ హెల్త్ సంస్థ అక్రమంగా వ్యవహరిస్తోందని, దీనివల్ల సరైన చర్చలకు ఆస్కారం లేకుండా పోతోందని ఏ.హెచ్.పీ.ఐ ఆరోపిస్తోంది. ఇన్సూరెన్స్ అంబుడ్స్ మన్ 2023-24 నివేదికను ప్రకారం... ఫిర్యాదుల జాబితాలో స్టార్ హెల్త్ సంస్థ మొదటి స్థానంలో ఉందని ఏ.హెచ్.పీ.ఐ చెబుతోంది. ఈ సంస్థపై 13,300 ఫిర్యాదులు నమోదు కాగా, వాటిలో 10,000కు పైగా క్లెయిమ్ తిరస్కరణలకు సంబంధించినవేనని పేర్కొంది. ఇది తర్వాతి నాలుగు అతి పెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థల ఫిర్యాదుల సంఖ్య కంటే చాలా ఎక్కువ. పాలసీదారులను ఈ స్థాయిలో మోసం చేయడం వల్లే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పై ఏ.హెచ్.పీ.ఐ తీవ్రంగా మండిపడుతోంది.

Next Story