వి హబ్‌లో స్టాండ్‌ విత్‌ హర్‌ చర్చా కార్యక్రమం

by Ajay Maddhiboyina |

సమాజంలో అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా ఇద్దరినీ సమానంగా చూసే పద్ధతి బయట సమాజం కంటే ముందు మన ఇళ్ల నుంచే మొదలుకావాలని. ఆడవాళ్లు ఈ పనులే చేయాలి..

వి హబ్‌లో స్టాండ్‌ విత్‌ హర్‌ చర్చా కార్యక్రమం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సమాజంలో అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా ఇద్దరినీ సమానంగా చూసే పద్ధతి బయట సమాజం కంటే ముందు మన ఇళ్ల నుంచే మొదలుకావాలని. ఆడవాళ్లు ఈ పనులే చేయాలి.. మగవాళ్లు ఆ పనులే చేయాలి అనే ఆ నియమాలను తరతరాలుగా అందరూ గుడ్డిగా పాటిస్తున్నారని తెలంగాణ మహిళా భద్రతా విభాగం డైరెక్టర్‌ జనరల్‌ డీజీ చారు సిన్హా పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని వి హబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ వేదికగా స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్‌లో భాగంగా ఐదో విడత సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో పోలీసు, సినిమా, విద్యా, జర్నలిజం తదితర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని తమ మనసులోని మాటలను పంచుకున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన వస్తుందని డీజీ చారు సిన్హా ఆకాంక్షించారు.

ఆడపిల్ల స్వేచ్ఛగా ఎదిగేందుకు కుటుంబాలు అండగా నిలవాలి.

కుటుంబం అనేది ఒక ప్రేమతో కూడిన బంధం లాంటిదని, అది ఒకరి కింద మరొకరు అణిగిమణిగి ఉండే బానిసత్వంగా మారకూడదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కె.సునీతా రాణి స్పష్టం చేశారు. ఆడవాళ్లు ఇలాగే ఉండాలనే పాతకాలపు ఆలోచనలను పక్కనబెట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఇంట్లో స్వేచ్ఛను ఇవ్వాలన్నారు. సమాజం పెట్టిన కండిషన్లను పక్కనపెడితే ప్రతి మనిషిలో ఎంతో అందమైన వ్యక్తిత్వం కనిపిస్తుందని ప్రముఖ సినీ నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. ఆడపిల్లలు ఇలాగే ఉండాలన్న ఒత్తిడి లేకుండా వాళ్లు స్వేచ్ఛగా ఎదిగేందుకు కుటుంబాలు అండగా నిలవాలని ఆమె చెప్పారు. ఇంట్లో ఆడవాళ్లు ఎప్పుడూ ఇతరుల కోసమే కష్టపడుతూ తమ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మర్చిపోకూడదని ప్లాంటారియం ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు పూర్ణిమ దీపిక సూచించారు.

మహిళలు ముందు తమ గురించి తాము ఆలోచించడం ఏమాత్రం స్వార్థం కాదని, ఒక మంచి కుటుంబం తయారు కావాలంటే అది చాలా అవసరమని స్పష్టం చేశారు.ఆడ, మగ సమానత్వం గురించి కేవలం ఆడవాళ్లే కాదు.. మగవాళ్లు కూడా కచ్చితంగా మాట్లాడాలని ప్రముఖ సినీ దర్శకుడు శశికిరణ్ తిక్క పిలుపునిచ్చారు. మగవాళ్లు కూడా ఈ విషయాలపై మాట్లాడుకున్నప్పుడే ఈ సమస్యలకు అసలైన పరిష్కారం దొరుకుతుందన్నారు. ఈ సదస్సుకు ప్రముఖ జర్నలిస్ట్ ఉమా సుధీర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. సోషియాలజీ రీసెర్చ్ స్కాలర్ అమన్ కుమార్ ఈ అంశంపై సామాజిక కోణంలో తన విశ్లేషణను పంచుకున్నారు. కుటుంబాల్లో వస్తున్న పాత పద్ధతులను మార్చడం, బాధ్యతలను పంచుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం ద్వారానే మంచి సమాజం నిర్మితమవుతుందని సదస్సు వేదికగా వక్తలు స్పష్టం చేశారు. లింగ సమానత్వంపై అవగాహన పెంచేందుకే స్టాండ్ విత్ హర్ పేరుతో ఏడాది పొడవునా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Next Story