ప్రీ ప్రైమరీ స్కూళ్లలో సిబ్బంది కొరత.. పట్టించుకోని అధికారులు

by Naga Rani Yarlagadda |

ఆరంభ శూరత్వం అన్న మాట పాఠశాల విద్యాశాఖకి సరిగ్గా సరిపోతుంది. ప్రభుత్వ బడులపై నమ్మకం పెంచేలా సర్కారు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నా.. అవి ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు.

ప్రీ ప్రైమరీ స్కూళ్లలో సిబ్బంది కొరత.. పట్టించుకోని అధికారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరంభ శూరత్వం అన్న మాట పాఠశాల విద్యాశాఖకి సరిగ్గా సరిపోతుంది. ప్రభుత్వ బడులపై నమ్మకం పెంచేలా సర్కారు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నా.. అవి ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రాథమిక పాఠశాలల్లో ఇటీవల ప్రారంభించిన ప్రీప్రైమరీ తరగతుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఇన్ స్ట్రక్టర్లు, ఆయాలు లేకుండానే ఈ తరగతులు నడుస్తున్నాయని, దీనివల్ల విద్యార్థుల బోధన, పర్యవేక్షణ కష్టమవుతోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వెయ్యి పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు

ప్రభుత్వ ఆదేశాల మేరకు వెయ్యి ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించారు. అయితే, ఈ తరగతులకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించలేదు. ప్రస్తుతం ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్టీజీ)లతోనే ఈ క్లాసులను నిర్వహించాలని డీఈఓల నుంచి ఆదేశాలు ఉన్నాయని, దీంతో ఇప్పటికే ఉన్న పనిభారంపై అదనపు భారం పడుతున్నదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈఓలు) సైతం ఈ సమస్యపై స్పందించడం లేదు. ప్రీప్రైమరీ తరగతులకు సంబంధించిన సిబ్బంది నియామకంపై ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని సమాచారం. ఈ విషయంపై స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ కూడా ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. సంబంధిత డీఈఓలకు రిక్రూట్ మెంట్ చేసుకోమని ఆదేశాలు ఇచ్చామంటూ అధికారులు దాటవేస్తున్నారు. దీంతో, ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణపై తీవ్ర గందరగోళం నెలకొంది.

ఇన్ స్ట్రక్టర్లు, సహాయకులను నియమించకుండా..

2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్ 12న రాష్ట్రంలోని 210 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులకు అనుమతులిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా నెలరోజుల తర్వాత జులై 16న 790 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులకు అనుమతులిచ్చింది. పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రీప్రైమరీ తరగతుల్లో ఇన్ స్ట్రక్టర్, సహాయకుల అవసరం తప్పనిసరి. కానీ, వీరు లేకుండా తరగతులు నడపడం పిల్లల భవిష్యత్తుకు ఆందోళన కలిగిస్తున్నదని గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రయివేటు స్కూళ్లలో లాగే ప్రీప్రైమరీ తరగతులు నిరాంటకంగా నడుస్తున్నాయని భావించామని, కానీ విద్యాశాఖ నిర్లక్ష్యంతో సిబ్బంది రిక్రూట్ మెంట్ లో అలసత్వం ఏమిటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యపై దృష్టి సారించి, ప్రీప్రైమరీ తరగతులకు అవసరమైన సిబ్బందిని నియమించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయసంఘాల నాయకులు కోరుతున్నారు.

Next Story