మహబూబాబాద్ ఆసుపత్రి మార్చురీ నుంచి రాత్రంతా ఏడుపులు.. ఊపిరి బిగపట్టి లోపలికి వెళ్లి చూస్తే..

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-30 13:49:34  IST  )

ప్రభుత్వాస్పత్రిలో మందుల కొరత ఉందని, వైద్యులు సమయానికి రావడం లేదని వచ్చినా వైద్యం చేయడం లేదని తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. దీంతో ప్రభుత్వాస్పత్రి అంటేనే ప్రజలు భయపడిపోతుంటారు. ఇక ఇప్పుడు అంతకు మించిన దారుణం చోటు చేసుకుంది.

మహబూబాబాద్ ఆసుపత్రి మార్చురీ నుంచి రాత్రంతా ఏడుపులు.. ఊపిరి బిగపట్టి లోపలికి వెళ్లి చూస్తే..
X

దిశ, మహబూబాబాద్/మహబూబాబాద్ టౌన్: ప్రభుత్వాస్పత్రిలో మందుల కొరత ఉందని, వైద్యులు సమయానికి రావడం లేదని వచ్చినా వైద్యం చేయడం లేదని తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. దీంతో ప్రభుత్వాస్పత్రి అంటేనే ప్రజలు భయపడిపోతుంటారు. ఇక ఇప్పుడు అంతకు మించిన దారుణం చోటుచేసుకుంది. బతికుండగానే పేషంట్‌ను తీసుకెళ్లి మార్చురీలో పడేశారు. ఈ ఘటన మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. ఆస్పత్రిలో కనిపించిన ఓ వ్యక్తిని సిబ్బంది గుర్తు తెలియని శవం అని తీసుకెళ్లి మార్చురీలో పెట్టేశారు. దీంతో ఆ వ్యక్తి రాత్రంతా మార్చురీలోనే ఉండిపోయాడు.

ఉదయం మార్చురీ శుభ్రం చేసేందుకు వచ్చిన స్వీపర్‌కు లోపల ఏడుపు వినిపించింది. షాక్‌తిన్న స్వీపర్ స్ట్రక్చర్‌పై ఉన్న వ్యక్తిని పరిశీలించగా బతికే ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే సూపర్ వైజర్ రాజుకు సమాచారం అందించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై మార్చురీకి వచ్చి రాజును ఏఎంసీలో అడ్మిట్ చేయించారు. కాగా, మూడు రోజుల క్రితం చిన్నగూడూరు మండలం, జయ్యారం గ్రామానికి చెందిన టాక్సీ డ్రైవర్ వెల్ది రాజు కిడ్నీ సంబంధిత సమస్యలో ఆరోగ్యం బాగా లేక ఆసుపత్రికి వచ్చాడు. అయితే అతడి వెంట అటెండర్ లేడని, ఆధార్ కార్డు లేదని అడ్మిట్ చేసుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో టాక్సీ డ్రైవర్ రాజు సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతడు చనిపోయాడని భావించిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా గుర్తు తెలియని శవమని మార్చురీలో పడేశారు.

అయితే, బతికి ఉన్న వ్యక్తిని శవమని మార్చురీలో వేసిన విషయం బయటకు పొక్కడంతో పేషెంట్ అడ్మిట్ రికార్డు, డెత్ రికార్డు ఇవ్వడానికి వైద్య సిబ్బంది నిరాకరిస్తున్నారు. జనరల్ ఆస్పత్రిలో వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పర్యవేక్షించాల్సిన ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఈఓ జగదీష్ పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు నిత్యం పునరావృతం అవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, వైద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ ఆస్పత్రిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

మానవత్వం చాటుకున్నాం: సూపరింటెండెంట్ శ్రీనివాసరావు

కాగా, ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు స్పందించారు. బతుకున్న వ్యక్తిని మార్చురీలో పెట్టారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. భిక్షాటన చేసే వ్యక్తి వర్షంలో పడి ఉండడంతో ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది మానవతా కోణంలో స్పందించి మార్చురీకి తరలించారన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వార్డుకు షిఫ్ట్ చేశారని వెల్లడించారు.

Next Story