ఎస్టీ హాస్టల్‌లో 'ఆకలి' కేకలు: నాలుగు నెలలుగా అందని మెనూ భోజనం!

by Gantepaka Srikanth |

ఆదివాసీ విద్యార్థుల పట్ల ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ఎస్టీ హాస్టల్‌లో ఆకలి కేకలు: నాలుగు నెలలుగా అందని మెనూ భోజనం!
X

సత్యనారాయణపురం ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు నాలుగు నెలలుగా మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. 130 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ హాస్టల్లో మోనూ సక్రమంగా అమలు కాకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, చర్ల: ఆదివాసీ విద్యార్థుల పట్ల ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సత్యనారాయణపురం ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు నాలుగు నెలలుగా మెనూ ప్రకారం భోజనం అందించనప్పటికీ ఏ ఒక్క అధికారి నోరు విప్పకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 130మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ హాస్టల్లో నాలుగు నెలలుగా ప్రభుత్వ అందించే మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడం గమనార్హం. సోమవారం దిశ దినపత్రికలో ‘మేము పెట్టిందే మెనూ అదే తిను’అంటూ కథనం ప్రచురించినా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు నోరు విప్పడం లేదని, విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నా పట్టనట్లుగా ఉంటున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు స్పందించి సత్యనారాయణపురం ఎస్టీ హాస్టల్ నిర్వాహకులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సత్యనారాయణపురం ఎస్టీ బాలుర హాస్టల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం అలసత్వం వహించిన వార్డెన్ ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఆదివాసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీకి వినతిపత్రం అందజేశారు.

నిర్లక్ష్య వైఖరి సరికాదు: ఇర్ప రాజు దొర, ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్

సత్యనారాయణపురం ఎస్టీ వసతి గృహంలో చదివే గిరిజన విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి సరికాదు. విద్యార్థులకు మెనూ అందించకుండా నిర్లక్ష్యం వహించిన వసతి గృహ సంక్షేమ అధికారిపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలి.

Next Story