మహారాష్ట్ర సీఎం సలహాదారుగా వెదిరె శ్రీరామ్

by Gantepaka Srikanth |

మహారాష్ట్ర సీఎం జలవనరుల సలహాదారుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామ్ వెదిరెను నియమించింది.

మహారాష్ట్ర సీఎం సలహాదారుగా వెదిరె శ్రీరామ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్ర సీఎం జలవనరుల సలహాదారుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామ్ వెదిరెను నియమించింది. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047తో దీర్ఘకాలిక జలవిధానంపై ఫోకస్ పెట్టింది. అందులోభాగంగా నదుల అనుసంధాన ప్రాజెక్టుల కోసం సమగ్ర దీర్ఘకాలిక విధానాన్ని సిద్ధం చేయడానికి, నీటి సంరక్షణ, భూగర్భజలాల నిర్వహణ, తాగునీటి సరఫరా పథకాలకు ప్రణాళికలు రూపొందించడానికి శ్రీరామ్‌ను నియమించారు. శ్రీరామ్ నీటి నిర్వహణ, విధానాలు, పునర్వినియోగ వ్యూహాలలోని వివిధ అంశాలలో సంస్కరణలు, అమలు వ్యూహాలను సిఫార్సు చేయనున్నారు. అలాగే.. సాగునీటి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మైనర్ జలవనరులను ప్రోత్సహించడంపై ఫోకస్ చేయనున్నారు.

డేటా, ఆధారిత పాలనల రూపకల్పన

నీటి నిర్వహణ కోసం శాటిలైట్ చిత్రాలు, భూగర్భజల డేటాబేస్‌లు, ఐఓటీ ఆధారిత సెన్సార్‌లను ఉపయోగించడం, నీటి వనరుల కోసం రియల్ టైమ్ ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడాన్ని శ్రీరామ్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు. మిత్ర, మహారాష్ట్ర జలవనరుల నియంత్రణ సంస్థ, మహారాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్‌తో సమన్వయం చేయనున్నారు. కేంద్ర జల సంఘం, జల శక్తి మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, జాతీయ జల మిషన్, అంతర్-పార్టీ/రాష్ట్ర వివాదాల యంత్రాంగాలతో సమన్వయం చేసుకోనున్నారు. జలవనరులు, మట్టి, నీటి సంరక్షణ, తాగునీరు, పారిశుధ్యం, పర్యావరణం, రెవెన్యూ, వ్యవసాయం వంటి విభాగాలతో సహకరిస్తూనే రాష్ట్రంలో మెరుగైన నీటి వనరుల దిశగా ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వనున్నారు.

అమెరికా నుంచి ఇండియాకు..

శ్రీరామ్ వెదిరె పారిశ్రామికవేత్త, కాలమిస్ట్, సంగీత చరిత్రకారుడు. ఆయన ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి 1987లో ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఆ తర్వాత మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్‌తో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆయన కేంద్ర జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన మంత్రిత్వ శాఖకు సలహాదారుగా పనిచేశారు. ఆయన అమెరికాలోని ఓ కంపెనీలో 15 ఏళ్లపాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. 2009లో భారత్‌కు తిరిగివచ్చారు. నీటి పారుదలపై అనేక రచనలు చేశారు. కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ సలహాదారుగా విధులు నిర్వర్తించారు. అలాగే నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీలో సభ్యుడిగానూ పనిచేశారు. అలాగే రాజస్థాన్ రివర్ బోర్డు చైర్మన్‌గానూ బాధ్యతల్లో కొనసాగారు.

Next Story