నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్‌పీకి పోటెత్తిన వరద.. భారీగా నీటి విడుదల

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-08 05:25:14  IST  )

తెలంగాణలో ఉన్న జలాశయాలకు మళ్లీ వరదనీరు పోటెత్తుతోంది.

నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్‌పీకి పోటెత్తిన వరద.. భారీగా నీటి విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉన్న జలాశయాలకు మళ్లీ వరదనీరు పోటెత్తుతోంది. రాష్ట్రంలో అడపా దడపా అక్కడక్కడా కురుస్తోన్న వర్షాలతో పాటు.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యాన్ని చేరుకోవడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు (Nagarjuna Sagar Project) వరదనీరు పోటెత్తడంతో 14 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 598.40 అడుగులు కాగా.. ప్రస్తుతం 588.40 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ గేట్లను ఎత్తడంతో ఆ అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. మరోవైపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం పెరగడంతో 8 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 52,840 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 53,685 క్యూసెక్కులుగా ఉంది.

పెద్దపల్లి జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం వరద ప్రవాహం కొనసాగుతుండగా.. 5 గేట్లను ఎత్తి 27,841 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా.. పూర్తిస్థాయిలో నీటి నిల్వ కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 27,841 క్యూసెక్కులుగా ఉంది.

Next Story