- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా ఐఏఎస్‌ల పరువును బజారుకు ఈడుస్తున్నారు.. మాజీ మంత్రి తీవ్ర ఆరోపణలు
రాష్ట్రంలో మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మహిళా ఐఏఎస్ అధికారుల పరువును బజారుకు ఈడుస్తున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మహిళా ఐఏఎస్ అధికారుల పరువును బజారుకు ఈడుస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఈ పరిణామాల వల్ల మహిళా అధికారులు రాష్ట్రంలో పని చేయడానికే భయపడుతున్నారని, ఫలితంగా దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు పోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై, రాష్ట్ర ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు. నిన్న మహబూబ్‌నగర్‌లో సీఎం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఎన్నికల ప్రసంగంలా ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపించినప్పుడే సీఎంకు పథకాలు గుర్తుకొస్తాయని, మున్సిపల్ ఎన్నికల కోసమే మళ్లీ చీరల పంపిణీ అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో, బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఇటీవల ఇరు పార్టీల నేతలు పరస్పరం పొగడ్తలతో ముంచెత్తుకోవడం మున్సిపల్ ఎన్నికల్లో వారి కుమ్మక్కుకు నిదర్శనమని అన్నారు.
కేసీఆర్ లేకుంటే నువ్వు సీఎం అయ్యేవాడివా?
అసెంబ్లీలో తన తండ్రి మరణ సమయంలో స్నానానికి నీళ్లు లేవని సీఎం చెప్పిన మాటలను శ్రీనివాస్ గౌడ్ ప్రస్తావిస్తూ.. ఇప్పుడు మహబూబ్‌నగర్‌లో అదే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలోనే పాలమూరు ముఖచిత్రం మారిందని గుర్తు చేశారు. ‘తెలంగాణకు దైవం కేసీఆర్. ఆయన తెలంగాణ తెచ్చి ఉండకపోతే నువ్వు సీఎం అయ్యేవాడివా?’ అంటూ రేవంత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు, కేటీఆర్‌లను మారీచుడు, సుబాహుడు అంటూ సంభోదించడం సీఎం స్థాయికి తగదని హితవు పలికారు.
దమ్ముంటే ఆ పర్మిషన్ తీసుకురండి..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏడు అనుమతులు వచ్చాయని, దమ్ముంటే మిగిలిన అనుమతిని సాధించి 90 టీఎంసీల నీళ్లు తీసుకురావాలని మంత్రులకు సవాల్ విసిరారు. జూరాలలో నీళ్లు లేనందునే తమ హయాంలో ప్రాజెక్టును శ్రీశైలం బ్యాక్ వాటర్స్‌కు మార్చామని వివరించారు. కేసీఆర్ హయాంలో కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా ద్వారా ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు అందించామని, మెడికల్ కాలేజీలు తెచ్చామని గుర్తు చేశారు. కేసీఆర్ తెచ్చిన ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్లు, తవ్విన కాలువలు కనిపించడం లేదా అని నిలదీశారు. మంత్రులు అశోక్‌నగర్ లైబ్రరీని సందర్శించగలరా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే మళ్లీ పాత రోజులే వస్తాయని హెచ్చరించారు. జిల్లాలను రద్దు చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు.






