- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రగతి భవన్‌ను హిట్లర్ బంకర్ చేసింది మీరు కాదా? కేటీఆర్‌పై మంత్రి ఫైర్
'ది హిందూ హడిల్' సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన అసలు సారాంశం తెలియకుండా, కేవలం 'హిట్లర్' అనే పదాన్ని పట్టుకుని బీఆర్ఎస్ దొంగ ఏడుపులు ఏడుస్తోందని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'ది హిందూ హడిల్' కాన్ క్లేవ్‍లో ఏ ఉద్దేశంతో మాట్లాడారో పూర్తిగా వినకుండా కేవలం ఒక పదాన్ని పట్టుకుని కొందరు బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడం అత్యంత సిగ్గుచేటు అని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. అంబేద్కర్, గాంధీజీల గురించి కేటీఆర్ మాట్లాడటం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అని అన్నారు. హిట్లర్ స్పూర్తితో హైడ్రా తీసుకువచ్చామన్న సీఎం వ్యాఖ్యలను కేటీఆర్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఇవాళ సీఎల్పీకార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు కేటీఆర్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ సదస్సులో సీఎం మాట్లాడిన పరిపాలనా తత్వశాస్త్రం, పరిపాలనా లోతును అర్థం చేసుకునే కనీస మేధో పరిపక్వత వారికి లేదన్నారు. సీఎం ప్రస్తావించింది కేవలం పనుల అమలు వేగం (Execution Speed), నిర్ణయాత్మకత (Decisiveness) గురించి మాత్రమే తప్ప... హిట్లర్ హింసా సిద్ధాంతాలను కాదన్నారు. హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలను కబ్జాదారుల నుంచి కాపాడాలంటే ఆ మాత్రం ఉక్కు సంకల్పం ఉండాలనే ఉద్దేశంతోనే ‘హిట్లర్’ గురించి సీఎం చెప్పారని క్లారిటీ ఇచ్చారు.
ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా..
‘తాపీ మేస్త్రీకి తలపోటు వస్తే... గోడ కూల్చినట్టుంది’ అన్న చందంగా కేటీఆర్ వ్యవహార శైలి ఉందని శ్రీధర్ బాబు విమర్శించారు. అక్కడ చర్చ జరిగిన సందర్భం ఏంటో తెలియదు, ఆ సదస్సు సారాంశం ఏంటో తెలియదు. కానీ.. ‘హిట్లర్’ అనే ఒక పదాన్ని పట్టుకుని ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. హైడ్రా (HYDRAA) స్పీడ్ కు కబ్జాదారుల గుండెల్లో పుడుతున్న వణుకు చూసి తట్టుకోలేక, ఎక్కడ ఏడ్వాలో తెలియక ఈ ‘హిట్లర్’ ముసుగు వేసుకుని కొందరు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు.
‘హిట్లర్ బంకర్’ లా మార్చినప్పుడు ఎక్కడిపోయావ్:
పదేళ్ల పాటు సచివాలయానికి రాకుండా ప్రగతి భవన్‌కు ఇనుప కంచెలు వేసి సామాన్య జనానికి ఎంట్రీ లేకుండా ఒక ‘హిట్లర్ బంకర్’ లాగా దాన్ని మార్చి పాలించినప్పుడు మీ రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడికి పోయింది? అని కేటీఆర్‍ను ప్రశ్నించారు. ప్రగతి భవన్ చుట్టూ ఇనుప కంచెలు వేసి, సామాన్య ప్రజలను రానివ్వకుండా పాలించిన మీదా గాంధీ మార్గం? ఇందిరా పార్క్ వద్ద ‘ధర్నా చౌక్’ను ఎత్తేసి ప్రజాస్వామ్య గొంతు నొక్కిన మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది?, ప్రత్యర్థులపై, సొంత పార్టీ నేతలపై ఫోన్ ట్యాపింగ్‌లు చేయించి నిఘా పెట్టిన మీదా ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ ఆశయాల ప్రకారం నీళ్లు, నిధులు, నియామకాలు జరిగాయా... నియామకాలు కేవలం మీ కుటుంబానికే జరిగాయి తప్ప... నిరుద్యోగులకేమైనా లాభం జరిగిందా? అని నిలదీశారు.
గాంధీ చేతులు కట్టుకు కూర్చోమనలేదు:
టీజీపీఎస్సీ పేపర్లను పప్పు బఠానీల్లా మార్కెట్లో అమ్మకానికి పెట్టి లక్షలాది నిరుద్యోగులకు అన్యాయం చేసింది మీరు కాదా? తప్పులన్నీ మీరు చేసి వాటిని సరిచేస్తున్న మాపై నిందలు వేస్తున్నారా కేటీఆర్? అని ప్రశ్నించారు. ఇలాంటి కబుర్లు చెప్తే బీఆర్ఎస్ కార్యకర్తలు వింటారు. కానీ ముసుగు వేసుకొని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారనే కనీస సోయి లేదా కేటీఆర్ అని మండిపడ్డారు. మహాత్మా గాంధీ ‘అహింస’ అన్నారే తప్ప దొంగతనాలు, కబ్జాలు జరుగుతుంటే చేతులు కట్టుకుని కూర్చోమనలేదన్నారు. చట్టాన్ని అమలు చేయడంలో చూపించే కఠినత్వాన్ని ఫాసిజం అనడం వారి అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. హైడ్రా చట్టపరిధిలోనే పనిచేస్తోందని, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే నోటీసులు ఇస్తోందన్నారు. కాకపోతే గతంలో లాగా కబ్జాదారులకు కొమ్ము కాయకుండా, వారితో కుమ్మక్కు అవ్వకుండా... ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తోందిన్నారు. ఈ మార్పు తెలంగాణకు అవసరం అని దీన్ని ప్రతి మేధావి, ప్రతి సామాన్యుడూ స్వాగతిస్తున్నారని చెప్పారు.
అది కాంగ్రెస్ డీఎన్ఏలోనే లేదు:
కాంగ్రెస్ పార్టీ హిట్లర్ క్రూరత్వాన్ని, హింసాత్మక ఫాసిజాన్ని ఎప్పటికీ సమర్థించదని అది మా డీఎన్‌ఏలోనే లేదన్నారు. తెలంగాణ సమాజం ఎవరి అహంకారంపై తిరగబడి.. ఎవరిని గద్దె దించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందో, అసెంబ్లీ, లోక్‌సభ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అన్నారు. అహంకారంతో ఊగిపోయిన మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు సహకరించాలి తప్ప ఇలాంటి చిల్లర కామెంట్స్ తో ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేయోద్దని కేటీఆర్ సూచించారు.






