- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అకాల వర్షాలను రాజకీయాలకు వాడొద్దు : మంత్రి శ్రీధర్‌బాబు
అకాల వర్షాలను రాజకీయాల కోసం వాడుకోవద్దని ప్రతిపక్షాలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటన ద్వారా చురకలంటించారు.

- అదిరైతు గోస కాదు.. బీజేపీ నాయకుల రాజకీయ ఘోష
- ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ డైవర్షన్ పాలిట్రిక్స్
దిశ, తెలంగాణ బ్యూరో: అకాల వర్షాలను రాజకీయాల కోసం వాడుకోవద్దని ప్రతిపక్షాలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటన ద్వారా చురకలంటించారు. పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా ఎరువుల ధరలు పెంచి, నల్ల చట్టాలతో తీవ్ర అన్యాయం చేసిన బీజేపీ.. ఇవాళ తెలంగాణలో రైతు గోస-బీజేపీ భరోసా పేరిట పొలిటికల్ యాత్రలు చేస్తున్నదని విమర్శించారు. అది రైతు గోస కాదని.. అధికారం కోసం బీజేపీ నాయకులు పెడుతున్న రాజకీయ ఘోష అని మండిపడ్డారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా అన్నదాతలకు అన్యాయం చేస్తున్నదెవరో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని అడగటానికి వెళ్తే.. మీ వాళ్లకు నూకలు తినటం అలవాటు చేయండంటూ అవమానించిన కేంద్ర మంత్రుల చరిత్రను మర్చిపోయారా అని ప్రశ్నించారు. అప్పుడు రైతుల పక్షాన నిలబడకుండా.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ఇక్కడ పొలిటికల్ టూర్లు మాని ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రైతాంగానికి న్యాయంగా రావాల్సిన హక్కులను, నిధులను సాధించుకురావాలని సూచించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా అన్నదాతలకు అండగా నిలవాల్సిన బీఆర్ఎస్.. ఆ పని పక్కనబెట్టి, కేవలం రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నదని పేర్కొన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా చివరి గింజ కొనే వరకు అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వీరి దుష్ప్రచారాన్ని నమ్మి రైతులు ఆందోళనకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు.






