‘ఐటీ మంత్రి పేషీ పేరుతో దోపిడీ’.. స్పందించిన శ్రీధర్ బాబు ఓఎస్‌డీ

by Gantepaka Srikanth |

తెలంగాణ సచివాలయం(Telangana Secretariat)లో ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) పేషీలో మంత్రి పేషీ పేరుతో ఒక భారీ మోసం తెరమీదకి వచ్చిన విషయం తెలిసిందే.

‘ఐటీ మంత్రి పేషీ పేరుతో దోపిడీ’.. స్పందించిన శ్రీధర్ బాబు ఓఎస్‌డీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సచివాలయం(Telangana Secretariat)లో ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) పేషీ పేరుతో ఒక భారీ మోసం తెరమీదకి వచ్చిన విషయం తెలిసిందే. ఐటీ మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ప్రాజెక్టు మంజూరు చేస్తామంటూ రూ.1.77 కోట్లు తీసుకొని మోసం చేశారని వార్తలు వైరల్ అవుతున్నాయి. మంత్రి ఓఎస్డీ లెటర్ హెడ్‌లు, నకిలీ పత్రాలు చూపి మోసం చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ కథనాలపై మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీ(Sridhar Babu OSD) స్పందించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు.

‘సోషల్ మీడియాలో ఐటీ మంత్రి పేషీ పేరిట ‘ఐటీ ప్రాజెక్ట్‌ ఇప్పిస్తామంటూ రూ.1.77 కోట్లు స్వాహా’ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ ఘటన జరిగింది కూడా ఇప్పుడు కాదు.. సుమారు నాలుగు నెలల కిందట జరిగింది. దీనిపై ఇప్పటికే సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఏడాది జూన్ 3న ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. మంత్రి ఆదేశాల మేరకు స్వయంగా నేనే సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా. ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరాము. ఈ వ్యవహారంలో ఆరుగురికి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించిన సైఫాబాద్ పోలీసులు గుర్తించారు. వారిపై కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తీవ్రత దృష్ట్యా కేసును పోలీసులు తాజాగా సైఫాబాద్ పీఎస్ నుంచి హైదరాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేశారు. అందుకే గతంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చిందని భావిస్తున్నాం. ఈ ఘటనలో మా పేషీకి గానీ, మా సిబ్బందికి గానీ ఎలాంటి సంబంధం లేదు’’ అని మంత్రి ఓఎస్‌డీ స్పష్టం చేశారు.

Next Story