కాక్రోచ్ పార్టీ ‘పార్లమెంట్‌ మార్చ్‌’కు అనుమతి లేదు: ఢిల్లీ పోలీస్ సంచలన ప్రకటన

by Ramesh Naini |

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన ‘చలో సంసద్‌’ యాత్రకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

కాక్రోచ్ పార్టీ ‘పార్లమెంట్‌ మార్చ్‌’కు అనుమతి లేదు: ఢిల్లీ పోలీస్ సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన ‘చలో సంసద్‌’ (పార్లమెంట్‌ మార్చ్‌) యాత్రకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. న్యూఢిల్లీలో BNSS సెక్షన్ 163 (పాత CrPC సెక్షన్ 144) అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడం, ర్యాలీలు, నిరసనలు చేపట్టడంపై నిషేధం విధించారు.

జంతర్ మంతర్ వద్దే అనుమతి..

ముందస్తు అనుమతితో కేవలం జంతర్ మంతర్ వద్ద మాత్రమే నిరసనలు తెలియజేయడానికి అవకాశముందని, పార్లమెంట్ వైపు మార్చ్‌కు అనుమతి లేదని పేర్కొన్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే BNS సెక్షన్ 223తో పాటు ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్లమెంట్ స్ట్రీట్, సెంట్రల్ విస్టా, జంతర్ మంతర్ వంటి సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి, బారికేడ్లు, పికెట్లను ఏర్పాటు చేశారు.

వెనక్కి తగ్గేదే లేదంటున్న సీజేపీ..

పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ, జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు తలపెట్టిన ‘చలో సంసద్’ యాత్ర యథావిధిగా జరుగుతుందని సీజేపీ నేత డిప్కే స్పష్టం చేశారు. కాగా, జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను శనివారం పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. వైద్య పర్యవేక్షణ కోసం ఆయన్ను ఆసుపత్రికి తరలించడాన్ని ఢిల్లీ హైకోర్టు సైతం సమర్థించింది. అయితే, ఆసుపత్రిలోనే వాంగ్‌చుక్ తన దీక్షను కొనసాగిస్తూ ద్రవాహారాన్ని సైతం నిరాకరిస్తున్నట్లు ఆయన భార్య గీతాంజలి అంగ్మో తెలిపారు. ఈ ‘చలో సంసద్’ యాత్రను విజయవంతం చేయాలని వాంగ్‌చుక్ అంతకుముందే ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story