Sridhar Babu: అలాంటి చారిత్రక తప్పిదం మేము చేయాలనుకోవడం లేదు

by Gantepaka Srikanth |

అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా పదేళ్లలో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.

Sridhar Babu: అలాంటి చారిత్రక తప్పిదం మేము చేయాలనుకోవడం లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా పదేళ్లలో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. గురువారం ముంబైలో నిర్వహించిన నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026లో ‘బియాండ్ పాలసీ.. డిజైన్డ్ టు విన్ ది గ్లోబల్ జీసీసీ రేస్’ అనే అంశంపై మంత్రి ప్రసంగించారు. మహా నగరాల అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే సంకల్పంతో తెలంగాణ రైజింగ్ విజన్ 2047కు శ్రీకారం చుట్టామని వివరించారు. ప్రపంచంలోని అనేక నగరాలు అస్తవ్యస్త పట్టణీకరణ వల్ల అర్బన్ కొలాప్స్ కోరల్లో చిక్కుకున్నాయని.. అలాంటి చారిత్రక తప్పిదాన్ని హైదరాబాద్ విషయంలో తాము చేయాలనుకోవడం లేదన్నారు. అందుకే.. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా దాన్ని నిర్మించే బాధ్యతను తీసుకున్నామన్నారు.

ఆ దిశగానే భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మెట్రో విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, ఆర్ఆర్ఆర్, మూసీ ప్రక్షాళన, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐకం ఇన్నోవేషన్ హబ్ తదితర కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. కేవలం టెక్ కంపెనీలే కాకుండా.. బ్యాంకింగ్, లైఫ్ సైన్సెస్, సెమీ కండక్టర్లు, రక్షణ రంగం, ఎఫ్ఎంసీజీ, స్పేస్ టెక్, ఆతిథ్యం తదితర బహుళ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్‌ను తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నాయన్నారు. గతేడాది 70కి పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది కొత్తగా 100 జీసీసీలను ప్రారంభించి.. కొత్తగా లక్ష మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి కోరారు. హైదరాబాద్‌లో ఉన్న ‘సిలికాన్ డెన్సిటీ’ని అందిపుచ్చుకుని మేడిన్ తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాస్కాం చైర్మన్ శ్రీకాంత్, ప్రెసిడెంట్ రాజేష్ నంబియార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story