SRH మ్యాచ్ ఎఫెక్ట్.. ఉప్పల్ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్

by Ramesh Naini |

ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న హోరాహోరీ ఐపీఎల్ మ్యాచ్ కారణంగా ఉప్పల్ పరిసరాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

SRH మ్యాచ్ ఎఫెక్ట్.. ఉప్పల్ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న హోరాహోరీ ఐపీఎల్ మ్యాచ్ కారణంగా ఉప్పల్ పరిసరాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి స్టేడియం వరకు వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారంటూ వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ముందస్తు ఆంక్షలున్నా..

మ్యాచ్ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఉప్పల్ జంక్షన్ వైపు భారీ వాహనాల రాకపోకలను నిషేధించి, వరంగల్ నుంచి వచ్చే వాహనాలను ఘట్‌కేసర్ వద్ద ఓఆర్ఆర్ (ORR) మీదుగా నాగోల్, ఎల్‌బీనగర్ వైపు మళ్లించారు. స్టేడియం వద్ద 5 ప్రధాన పార్కింగ్ ప్రదేశాలు (సాధారణ ప్రజలకు స్టేడియం బయట 4, వీఐపీలకు లోపల 1) ఏర్పాటు చేశారు. అభిమానులు ఆర్టీసీ, మెట్రో సేవలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. క్రికెట్ అభిమానుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ మెట్రో రైలు తమ సేవలను అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించింది. అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసినప్పటికీ, భారీ రద్దీతో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు.

సన్‌రైజర్స్ భారీ స్కోరు

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సొంతగడ్డపై పరుగుల వర్షం కురిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించి రాజస్థాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు.

Next Story