పంతం నీదా.. నాదా.. సై.. తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు

by Prasad Jukanti |

అసెంబ్లీ సమావేశాలు లేదా ఆ అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది.

పంతం నీదా.. నాదా.. సై.. తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాజకీయ వ్యవహారాలతో బిజీ బిజీగా గడిపే తెలంగాణ ప్రజా ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం రిలాక్సేషన్ కోసం ఏర్పాట్లు చేస్తోంది. బడ్జెట్ సమావేశాలు (Telangana Budget Sessions 2026) లేదా ఆ అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా ఆటల పోటీలు (Sports) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 99 డేస్ యాక్షన్ ప్లాన్‍లో భాగంగా నిర్వహించబోయే ఈ ఆటల పోటీల్లో ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి పాల్గొనేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే విషయంలో గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. సభ్యులంతా కలిసి ఆటపోటీల్లో, కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనే సంస్కతి గతంలో ఉందని దానిని తిరిగి పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నామని ఇదివరకే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాల అనంతరం కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. నిత్యం రాజకీయ విమర్శలు, ప్రసంగాలతో బీజీగా ఉంటే ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో తమలోని ప్రతిభను బయటపెట్టనున్నారు.

ఏపీలో ఆటవిడుపు:

ఏపీలో కూటమి ప్రభుత్వం ఆటవిడుపు పేరుతో క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ప్రజా ప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకర వాతావరణంతో గడుపుతున్నారు. ఇటీవల ఏపీ బడ్జెట్ సమావేశాలు ముగియగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కళా, క్రీడా ప్రతిభను చాటారు. తమ నటన తీరుతో ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి పాత్రలను పండించారు. ఏపీ ఆటవిడుపు ఆహ్లాదకరంగా సాగగా మరి తెలంగాణలో ఎలా ఉండబోతోంది అనేది వేచి చూడాలి.

Next Story