రేపే జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితా.. ఆ ఏడు నియోజకవర్గాలపై ఉత్కంఠ

by Gantepaka Srikanth |

కాంగ్రెస్​పార్టీలో జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక స్పీడ్​అందుకుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు వీటిని సమన్వయం చేస్తున్నారు.

రేపే జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితా.. ఆ ఏడు నియోజకవర్గాలపై ఉత్కంఠ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​పార్టీలో జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక స్పీడ్​అందుకుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు వీటిని సమన్వయం చేస్తున్నారు. దీని కోసం జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు నుంచి నలుగురి పేర్లు సూచిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు జాబితా అందజేశారు. మరికొందరు శని, ఆదివారాల్లో అందించేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు మండల కమిటీల సమావేశం ఏర్పాటు చేసుకొని వారే అభ్యర్థులను నిర్ణయించుకొని పేర్లు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈనెల 5వ తేదీ కల్లా జాబితా పీసీసీ అధ్యక్షుడికి ఇవ్వాలని ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు సూచించారు.

ఇన్‌చార్జి మంత్రులదే బాధ్యత

జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసి పంపించే బాధ్యత జిల్లా ఇన్‌చార్జి మంత్రులదేనని ఇప్పటికే ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఉమ్మడి జిల్లాల వారిగా ఎమ్మెల్యేలను, ఆ జిల్లా మంత్రులను సమావేశ పరిచి జాబితా రూపొందించడం, వారి పని, కొత్త పాత నాయకుల మధ్య వివాదాలు, విభేదాలు ఉంటే సర్ది చెప్పాలని సీఎం ఇన్‌చార్జి మంత్రులకు సూచించారు.

అభ్యర్థుల ఎంపికలో మార్గదర్శకాలు

జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ఇచ్చే జాబితాను సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇన్‌చార్జి కూర్చొని ఫైనల్ చేయనున్నారు. జాబితాకు ముందు వీరు ముగ్గురు సమావేశమై అభ్యర్థుల ఎంపికకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఇందులో పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్న వారు, సామాజిక న్యాయం, అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఉన్న వారిపై నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు అసెంబ్లీలో టికెట్ ఇచ్చినా ఓడిపోయిన వారికి, ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కీలక పదవుల్లో ఉన్న వారి వారసులు, బంధువులకు, గత అసెంబ్లీ, పార్లమెంటు​ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వారికి ప్రాధాన్యత ఇవ్వాలా.? లేదా? వంటి వాటిపై మార్గదర్శకాలు ఖరారు చేయనున్నారు.

సర్వే ద్వారా అభ్యర్థుల ఎంపిక

పీసీసీ అధ్యక్షుడికి జాబితా చేరాక .. వారి పేర్లపై వివిధ మార్గాల ద్వారా సర్వే చేయించి తుది జాబితాను ప్రకటించే అవకాశాలున్నాయి. ఏకాభిప్రాయం ఉన్న చోట ఎంపిక సులువుగానే ఉన్నా.. చాలా చోట్ల ఎవరికి వారు తమకే టికెట్ కావాలంటూ పట్టుబడుతున్నారు. దీంతో వారి పేర్లపై సర్వే చేయించి ఖరారు చేయనున్నారు.

ఆ ఏడు నియోజకవర్గాల్లో ఎలా?

బీఆర్‌ఎస్​నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పార్టీకి కత్తి మీద సాములా మారిందని నేతలు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​నుంచి పోటీ చేసిన వారు, పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఇద్దరు సైతం తాము ఎవరిని సూచిస్తే వారికే టికెట్ ఇవ్వాలని ఇప్పటికే ఒత్తిడి పెంచారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు ఎలా అవకాశం కల్పిస్తారు? అంటూ ఓడిపోయిన​అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. వారి సూచిస్తున్న అభ్యర్థులందరు బీఆర్‌ఎస్​నుంచి వచ్చిన వారేనని, తాము సూచించే వారు కాంగ్రెస్‌కు​చెందిన వారని చెబుతున్నారు. ఇరు వర్గాలు సూచించిన పేర్లను రాష్ట్ర స్థాయికి పంపించి నిర్ణయం తీసుకుంటారనే భావనలో జిల్లా మంత్రులు, డీసీసీ అధ్యక్షులు ఉన్నట్లు సమాచారం.

కరీంనగర్​ జిల్లా నేతల భేటీ

కరీంనగర్​జిల్లాకు చెందిన అభ్యర్థుల ఎంపిక కోసం ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం మినిస్టర్​క్వార్టర్స్‌లో సమావేశం నిర్వహించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్​, అడ్లూరి లక్ష్మణ్​ కుమార్‌తో సహా ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు పాల్గొన్నారు. ఇందులో గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. కొన్ని నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ అభ్యర్థుల పేర్లను ఇన్‌చార్జి మంత్రికి అప్పగించారు. మరికొన్ని నియోజకవర్గాలకు చెందిన జాబితా రేపు కొందరు, ఎల్లుండి కొందరు ఇస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్​నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపికకు ఇద్దరిని కూర్చోబెట్టి సమన్వయం చేయాలని నిర్ణయించారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల జాబితా ఉండాలని నిర్ణయించారు.

నేడు మీనాక్షి రాక..

ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నేడు​హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సారి ఆమె పర్యటనలో ప్రధానంగా స్థానిక ఎన్నికలకు సన్నద్ధత, గెలుపు వ్యూహాలు, అనుసరించాల్సిన ప్రణాళిక, అభ్యర్థుల ఎంపికకు మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు. ఆదివారం లేదా సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌తో ఆమె సమావేశం కానున్నట్టు సమాచారం. ఇందులో అభ్యర్థుల ఎంపికకు మార్గదర్శకాలపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేస్తారు.

Next Story