KCR కి మరో తలనొప్పి... ప్రతిపక్షాల డ్యూటీ చేస్తోన్న స్వపక్ష నేతలు!!

by Dishanational1 |
KCR కి మరో తలనొప్పి... ప్రతిపక్షాల డ్యూటీ చేస్తోన్న స్వపక్ష నేతలు!!
X

ఎమ్మెల్యేలకు రైతు రుణమాఫీ టెన్షన్ పట్టుకుంది. ఈ అంశంపై గులాబీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ప్రచార సభల్లోనూ సీఎం కేసీఆర్.. రుణమాఫీ చేసి తీరుతమని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీని అటకెక్కించారు. విడతల వారీగా చేస్తామని ఏండ్లుగా నాన్చుతుండగా.. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా రుణమాఫీపైనే రైతుల నుంచి గులాబీ లీడర్లు ప్రశ్నలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అడుగడుగునా రుణమాఫీపైనే రైతులు నిలదీస్తున్నారంటూ ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ఓపెనింగ్ సందర్భంగా ఎమ్మెల్యేల మధ్య చర్చకు వచ్చింది. సార్.. రుణమాఫీ చేయకుంటే పార్టీ నష్టమంటూ కొందరు ఎమ్మెల్యేలు ధైర్యం చేసి కేసీఆర్.. కేటీఆర్ కు దృష్టికి తీసుకెళ్లారు. రుణమాఫీపై విపక్షం కంటే స్వపక్షమే ఫైట్ చేసే దుస్థితి తలెత్తింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు రుణమాఫీ గులాబీ నేతల్లో గుబులు రేపింది. క్షేత్రస్థాయిలో ఎక్కడికెళ్లినా దీనిపైనే రైతులు, ప్రజలు నిలదీస్తుండగా ఎమ్మెల్యేలకు తలనొప్పిగా తయారైంది. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై కొందరు ఎమ్మె్ల్యేలు ధైర్యం చేసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికలకు వెళ్లాలంటే ముందుగా రుణమాఫీ చేయాలని ఒత్తిడి పెంచినట్టు.. విపక్షాల కంటే స్వపక్షం నుంచే ఎక్కువపోరు సర్కార్ కు ఎదురైతున్నట్టు టాక్.

సగం కూడా చేయలే..

లక్ష లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని 2018 అసెంబ్లీ ఎన్నిక మేనిఫెస్టోలో కేసీఆర్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఒకేసారి రుణమాఫీ చేయడం కష్టమని తేలింది. నాలుగు దఫాలుగా చేస్తామని సర్కార్ చెప్పింది. ఇప్పటికీ సగం మందికి కూడా మాఫీ చేయలేదు. ముందుగా రూ. 25 వేల లోపు అప్పు రైతులకు మాత్రమే చేసింది. 2021‌‌ –22 బడ్జెట్ లోనూ రూ. 50 వేల వరకు మాఫీ చేస్తామని నిధులు కేటాయించింది. కేవలం రూ. 37 వేల లోపు రుణం రైతులకే మాఫీ జరిగింది. నాలుగేండ్లలో కేవలం 5.66 లక్షల మంది రైతులకే మాఫీ అయ్యింది. ఇంకా 31 లక్షల మందికి ఎదురుచూపులు తప్పడంలేదు.

ఢిల్లీలోనూ ప్రధానంగా చర్చ

రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటిస్తుండగా.. రుణమాఫీ ఏమైంది? ఎప్పుడు మాఫీ చేస్తారు? మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి? ఇక మాఫీ చెయ్యరా? అనే ప్రశ్నలు రైతుల నుంచి ఎదుర్కొంటున్నారు. దీంతో వారికి ఎలా సర్ది చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ ఆఫీసు ప్రారంభానికి వెళ్లిన ఎమ్మెల్యేల మధ్య రుణమాఫీపైనే ప్రధానంగా చర్చ జరిగింది. రైతుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని చాలామంది ఎమ్మెల్యేలు ఆవేదన చెందినట్టు తెలిసింది.

సార్.. ఎక్కడికెళ్లినా..

రుణమాఫీ పెండింగ్ కారణంగా రైతుల్లో ప్రభుత్వంపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుందని అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పట్టుకుంది. కొందరు ఎమ్మెల్యేలు ధైర్యం చేసి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ''సార్ రైతు రుణమాఫీ చేయండి.. గ్రామాల్లో తిరుగలేకపోతున్నాం.. ఎక్కడికి వెళ్లినా రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? అనే రైతులు అడుగుతున్నారు. రుణమాఫీ చేయకుండా ఎన్నికలకు వెళ్తే పార్టీకి నష్టం.'' అని వివరించినట్టు సమాచారం.

Also Read...

రేవంత్ ఉక్కిరిబిక్కిరి.. హై కమాండ్‌‌కు తరచూ కంప్లైంట్స్!

Next Story

Most Viewed