మీ పిల్లలను గమనిస్తున్నారా?

by velandi.Saikiran |   (  Updated:2026-07-11 22:00:59  IST  )

అరచేతిలోని స్మార్ట్‌ఫోన్ పిల్లలకు అనంతమైన జ్ఞానం అందిస్తున్న మాట వాస్తవమే.. కానీ, అదే సమయంలో అనుకోని ప్రమాదాల బారినపడుతున్నారు.

మీ పిల్లలను గమనిస్తున్నారా?
X

మీ పిల్లలను గమనిస్తున్నారా?

- చిన్నారుల స్నేహాలపై కన్నేయకపోతే ప్రమాదమే

- గేమింగ్‌, చాటింగ్‌ యాప్‌లతో సైబర్ నేరగాళ్ల వల

- కలకలం రేపుతున్న ఆన్‌లైన్‌ ట్రాప్‌ కేసులు

- పేరెంటల్‌ కంట్రోల్స్ ఉండాలంటున్న పోలీసులు

దిశ, తెలంగాణ బ్యూరో: అరచేతిలోని స్మార్ట్‌ఫోన్ పిల్లలకు అనంతమైన జ్ఞానం అందిస్తున్న మాట వాస్తవమే.. కానీ, అదే సమయంలో అనుకోని ప్రమాదాల బారినపడుతున్నారు. భౌతిక ప్రపంచంలో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో.. ఎవరితో ఆడుకుంటున్నారో గమనించే తల్లిదండ్రులు.. పిల్లల డిజిటల్‌ ప్రపంచం పై మాత్రం ఆ స్థాయిలో నిఘా ఉంచడం లేదు. సరిగ్గా ఈ లోపాన్నే ఆసరాగా చేసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు చిన్నారులను తమ వలలో బంధిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో నమోదవుతున్న పలు కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల ఆన్‌లైన్‌ భద్రతపై తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తూ పోలీసులు కీలక సూచనలు జారీచేశారు. ఇంటర్నెట్‌కు ఎలాంటి ఏజ్‌ ఫిల్టర్‌ లేదు.. కాబట్టి తల్లిదండ్రులే ఒక ఫిల్టర్‌లా మారి పిల్లలను కాపాడుకోవాలి. నేటి తరానికి ఆన్‌లైన్ అసలు ప్రపంచంగా మారిపోయిందని, అందులో తల్లిదండ్రులు కూడా భాగస్వాములు కాకపోతే పిల్లలు అగాధంలో పడిపోయే ప్రమాదం ఉంది.

ట్రాప్‌ చేసి బ్లాక్‌మెయిల్‌

ఇటీవల నగరంలోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వెలుగుచూసిన ఘటనలు సైబర్‌ నేరగాళ్లు పిల్లలను ఎలా లక్ష్యంగా చేసుకుంటున్నారో కళ్లకు కడుతున్నాయి. ఆన్‌లైన్‌ గేమింగ్‌ పబ్జీ, ఫ్రీఫైర్‌ తదితర గేమ్స్‌ ఆడుతూ అపరిచితుల మాయమాటలు నమ్మి నగరంలోని ఓ బాలుడు తల్లిదండ్రుల బ్యాంక్‌ ఖాతా నుంచి లక్షల రూపాయలు సైబర్ కేటుగాళ్లకు బదిలీ చేశాడు. మరోవైపు, ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలతో పరిచయం పెంచుకుని, బాలికలను ట్రాప్‌ చేసి వారి వ్యక్తిగత ఫొటోలు సేకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఉదంతాలు అనేకం చోటుచేసుకున్నాయి.

స్నేహమే ఉరితాడు

సైబర్‌ ప్రపంచంలో ముఖ పరిచయం లేని వారితో పిల్లలు చేసే రహస్య స్నేహాలు వారి పాలిట ఉరితాళ్లుగా మారుతున్నాయి. ఆన్‌లైన్‌లో పరిచయమయ్యే వ్యక్తులు.. బయట కూడా అపరిచితులే అన్న నగ్నసత్యాన్ని పిల్లల మనసుల్లో బలంగా నాటాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. సైబర్ నేరగాళ్లు ముందుగా గేమ్స్‌లో సాయం చేస్తామని, ఫ్రీగా పాయింట్లు ఇస్తామని ఆశచూపి పిల్లలతో పరిచయం పెంచుకుంటారు. ఆ తర్వాత రహస్యంగా చాటింగ్ చేయడం అలవాటు చేస్తారు. ఇలాంటి అనుమానాస్పద పరిచయాలు, మెసేజ్‌లు పిల్లల డివైజ్‌లలో కనిపిస్తే తల్లిదండ్రులు ఏమాత్రం ఉపేక్షించకూడదు.. అభం శుభం తెలియని చిన్నారులను మానసికంగా తమవైపు తిప్పుకుని, ఆపై వారిని బెదిరింపులకు, లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఇలాంటి కేసులు తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లల భద్రతకు ముప్పే

పిల్లలు వాడే స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు,కంప్యూటర్లలో తప్పనిసరిగా పేరెంటల్‌ కంట్రోల్స్ ఆన్‌ చేసి ఉంచాలి. దీనివల్ల వయసుకు మించిన, అసభ్యకరమైన వెబ్‌సైట్లు ఓపెన్ కాకుండా అడ్డుకట్ట వేయొచ్చు. అంతేకాకుండా, పిల్లలు రోజూ ఏయే యాప్స్ వాడుతున్నారు. అందులో ఎంత సమయం గడుపుతున్నారు. ఎవరితో చాటింగ్ చేస్తున్నారు అన్న విషయాలపై తల్లిదండ్రులకు స్పష్టమైన అవగాహన ఉండాలి. పిల్లల ప్రవర్తనలో ఆకస్మాత్తుగా భయం, ఆందోళన, ఒంటరిగా ఉండటం వంటి మార్పులు కనిపిస్తే వారు ఆన్‌లైన్‌లో వేధింపులకు గురవుతున్నారని గ్రహించాలి. వారిని కోపంతో మందలించకుండా ప్రేమతో దగ్గరకు తీసుకుని విషయాలు రాబట్టాలి. సైబర్ నేరగాళ్ల బారినపడ్డారని అనుమానం వస్తే భయపడకుండా, పరువు పోతుందనే సంకోచం లేకుండా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 లేదా 1098కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. నిర్లక్ష్యం చేసే ప్రతి నిమిషం పిల్లల భద్రతకు ముప్పే, వారి ఆన్‌లైన్ ప్రపంచంలో మీరూ ఓ భాగమై రక్షణ కవచంగా నిలవాలి.

- అరవింద్ బాబు, సైబర్ క్రైమ్ డీసీపీ

Next Story