జలసౌధ ‘కింగ్ మేకర్స్’ బాధితులెందరో ?

by velandi.Saikiran |   (  Updated:2026-07-11 22:31:04  IST  )

‘జలసౌధలో ఎవరికి ప్రమోషన్ రావాలన్నా.. ఆ అధికారి పేరు జాబితాలో ఉండాలన్నా.. ఎవరికి ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ కావాలన్నా.. డిసైడ్ చేసేది వీరే. అందులో నేనూ బాధితుడినే.

జలసౌధ ‘కింగ్ మేకర్స్’ బాధితులెందరో ?
X

జలసౌధ ‘కింగ్ మేకర్స్’

బాధితులెందరో ?

- మంత్రి వార్నింగ్ ఇచ్చినా మారని అధికారి తీరు

- మహబూబ్‌నగర్‌లో డ్యూటీ మాని జలసౌధలోనే చక్కర్లు

- ఔను.. నేనూ బాధితుడినే..! : ఓ అధికారి ఆవేదన

- ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న లీలలు

దిశ, తెలంగాణ బ్యూరో: ‘జలసౌధలో ఎవరికి ప్రమోషన్ రావాలన్నా.. ఆ అధికారి పేరు జాబితాలో ఉండాలన్నా.. ఎవరికి ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ కావాలన్నా.. డిసైడ్ చేసేది వీరే. అందులో నేనూ బాధితుడినే. నా ప్రమోషన్‌నూ అడ్డుకున్నారు. అప్పుడున్న ఈఎన్సీలను మభ్యపెట్టి రెండేళ్ల పాటు ప్రమోషన్ రాకుండా చేశారు. లేదంటే ఈపాటికి కీలక పొజిషన్‌లో ఉండేవాడిని. అదృష్టం కొద్దీ ఈ పొజిషన్‌లో ఉన్నా’ అని నీటిపారుదల శాఖలోని ఓ కీలక అధికారి చెప్పిన మాటలివి. ఓ స్థాయిలో ఉన్న అధికారికే ఇలాంటి ఇబ్బందులు తప్పలేదంటే.. కింది స్థాయి ఉద్యోగులను ఈ కింగ్ మేకర్స్ ఏ స్థాయిలో వేధించారో ఈ మాటల్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇలా ఏళ్లుగా ఆ డిప్యూటీ ఈఎన్సీ, డిప్యూటీ ఈఈలదే హవా నడుస్తున్నదని ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా.. వీరి ఆగడాల మీద ‘దిశ’ పత్రిక ఎట్టకేలకు కథనం ప్రచురించడంతో చాలా మంది ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. అవును.. వీరి ఆగడాలకు రోజురోజుకూ అంతులేకుండా పోతున్నదని చర్చించుకోవడం కనిపించింది. చాలా మంది అర్హత కలిగిన ఉద్యోగులు వీరి వల్ల ప్రమోషన్లు కోల్పోయారన్న ప్రచారం జరుగుతున్నది.

మంత్రి హెచ్చరించినా అదే తీరు..

మహబూబ్‌నగర్ జిల్లాలో డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న అధికారి నిత్యం జలసౌధలోనే ఉండిపోతున్నారు. పేరుకు ఆయన పోస్టు మహబూబ్‌నగర్ జిల్లాలో అయినప్పటికీ ఆయన ఎప్పుడూ కనిపించేది జలసౌధలోనే. జలసౌధలోనే ఉంటూ పైరవీలు చేయడానికే ఆయన అలవాటు పడినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. నిత్యం జలసౌధకు రావడం.. పైరవీలు చేయడం.. బదిలీలు, ప్రమోషన్ల వ్యవహారంలో తలదూర్చడం.. ఇదే ఆయన చేసే పని అని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇదే విషయంలో గతంలోనూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి వెళ్లిందని.. ఆయన పిలిచి హెచ్చరించారని తెలిసింది. అయినప్పటికీ.. ఆయన తీరులో ఏ మాత్రం మార్పు రాలేదని.. అదే ధోరణితో వెళ్తున్నారని ఉద్యోగులు అంటున్నారు. మంత్రి ఆదేశాలను, హెచ్చరికలను సైతం లెక్కలోకి తీసుకోకుండా మళ్లీ జలసౌధలోనే కనిపిస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీలు, ప్రమోషన్లలోనూ ఆయన హస్తం ఉండడమే కాకుండా.. త్వరలో జరిగే మరికొన్ని ప్రమోషన్ల జాబితాలోనూ ఆయనదే ఫైనల్ నిర్ణయం అని ప్రచారం జరుగుతోంది. ఆయన ఫైనల్ చేసిన పేర్లే ప్రస్తుతం ఈఎన్సీ, సెక్రెటరీ టేబుల్స్ మీద ఉన్నాయని తెలుస్తోంది.

బాధితులెందరో..?

జలసౌధలో ఏటా ప్రమోషన్ల లిస్టు ఆగస్టు 31తో ముగస్తుంటుంది. ప్రమోషన్స్ డిపార్ట్‌మెంట్ కూర్చొని ఉద్యోగుల పేర్లను ఫైనల్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం ఏ సంబంధం లేని ఈ ఇద్దరు అధికారులే వీటిలో జోక్యం చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతున్నది. అయితే.. వీరి వల్ల చాలా మంది అర్హత కలిగిన అధికారులు ప్రమోషన్లు కోల్పోయారన్న ప్రచారం జలసౌధలో జరుగుతున్నది. చాలా మంది ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా వీరి లీలలు బయటపడుతుండడమే కాకుండా నీటి పారుదల శాఖలో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సదరు అధికారి ఇప్పటి నుంచి అయినా మహబూబ్‌నగర్‌లో డ్యూటీ చేసుకుంటారా..? లేదంటే ఎప్పటిలాగే జలసౌధకే పరిమితం అవుతారా అనేది చూద్దాం..!! అటు మరో అధికారి సైతం 15 ఏళ్లుగా ఒకే విభాగంలో పనిచేస్తుండడం.. అన్నింటిలోనూ జోక్యం చేసుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. అలాగే.. ప్రస్తుతం ఈఎన్సీ, సెక్రెటరీ టేబుల్స్ మీద ఉన్న ప్రమోషన్లలోనూ అర్హులకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Next Story