- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాగు భారం..‘కౌలు’ దూరం
రాష్ట్రంలో వ్యవసాయానికి కౌలు రైతులు దూరమవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లభించకపోవడంతో కొత్త ఉపాధి కోసం తిప్పలుపడుతున్నారు.

సాగు భారం..‘కౌలు’ దూరం
- తరుముతున్న కరువు.. భూములన్నీ పడావు
- బుకింగ్ విధానంతో బుగ్గవుతున్న కౌలురైతు
- ఏండ్లు గడిచినా గుర్తింపు ఇవ్వని ప్రభుత్వం
- 2011 చట్టం అమలు చేయాలని రైతు సంఘాల డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వ్యవసాయానికి కౌలు రైతులు దూరమవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లభించకపోవడంతో కొత్త ఉపాధి కోసం తిప్పలుపడుతున్నారు. సంవత్సరాలు గడిచినా పాలకుల కౌలు రైతులకు గుర్తింపు ఇవ్వడం లేదు. గతేడాది నుంచి పత్తి, ధాన్యం అమ్మకాలతో పాటు యూరియా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం యాప్ ప్రవేశపెట్టింది. దీంతో కౌలు రైతులకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పండించిన పంటను అమ్మకాలు చేసేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు లంచాలు ఇచ్చినా మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముకునే దుస్థితి వచ్చింది. దీనికి తోడు పంట సాగు చేయాలంటే అప్పులు చేయాల్సి వస్తోంది. సవాలక్ష కష్టాల మధ్య వ్యవసాయం ఎందుకని బతుకుదెరువు కోసం సమీపంలోని పట్టణాలకు వలసబాట పడుతున్నారు. దీనికితోడు ఈఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని రైతులు ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయాలని ప్రభుత్వం చెప్పడంతో చాలా మంది రైతులు వ్యవసాయం చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఈ ఏడాది చాలా జిల్లాలో గతంలో సాగు చేసిన వందలాది ఎకరాల భూములు పడావు పడ్డాయి.
ఎన్నికల్లో వరాలు...
ఎప్పడు ఎన్నికలు జరిగినా నాయకులకు ముందుగా కౌలు రైతులే గుర్తొస్తారు. తాము అధికారం చేపట్టిన తర్వాత కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి పట్టాలు కలిగిన రైతులతో సమానం పథకాలు వర్తింపజేస్తామని ఊదరగొట్టడం అలవాటుగా మారింది. అధికారం చేపట్టిన వారి సమస్యలు పట్టించుకున్న నాథుడే లేడు. ఒక వేళ రైతులు నిలదీస్తే భూమి లీజుకు తీసుకున్నట్టు ఒప్పంద పత్రాలు చూపించాలని షరతులు పెడుతున్నారు. దీంతో మళ్లీ కౌలు రైతుల పరిస్థితి మొదటికొస్తుంది. ప్రభుత్వంపై విమర్శలు, ఆందోళన చేయడం జరుగుతుంది. 2011లో అప్పటి కాంగ్రెస్ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు చట్టం అమలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్చేస్తున్నాయి. ఎన్నాళ్లు కౌలు రైతుల సమస్యలు పట్టించుకోకుండా వారికి గుర్తింపు కార్డులు ఇవ్వకుండా పాలకులు తప్పించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సుమారుగా 25 లక్షల పైచిలుకు కౌలు రైతులు ఉండవచ్చని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. కౌలు రైతుల హక్కుల పరిరక్షణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలులో ఉన్న వ్యవసాయ భూముల చట్టం-1950, ల్యాండ్ లైసెన్స్‌డ్ కౌలుదారు చట్టం-2011 కౌలు రైతులకు కల్పించిన క్రాప్ కల్టివేషన్ రైట్ సర్టిఫికెట్, లోన్ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ వంటి హక్కుల కల్పించాలి. కౌలు రైతులు పంటల పెట్టుబడికి పంట రుణాలు, ఫసల్ బీమా, ప్రకృతి వైపరీత్యాలకు పంటకు నష్టపరిహారం కోల్పోవడమే కాకుండా ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న రైతు భరోసా, క్రాప్ లోన్లు వంటి పథకాలు వర్తించడం లేదు.
యూరియా యాప్, పత్తికి స్లాట్బుకింగ్..
గతేడాది నుంచి కేంద్రం పత్తి కొనుగోలుకు స్లాట్బుకింగ్, యూరియా తీసుకోవాలంటే ముందుగా యాప్‌లో బుకింగ్, ధాన్యం అమ్మాలంటే పట్టాదారు పాస్బుక్వంటి నిబంధనలు రావడం కౌలు రైతులు వ్యవసాయం వైపు మొగ్గు చూపడం లేదు. ఆరుగాలలు పండించిన పంట అమ్మకం చేయాలంటే ఇన్ని కష్టాలు ఉంటే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఉంటాయని ఇతర మార్గాలపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం నిజమైన పంట సాగు చేసిన రైతులకు పెట్టుబడి సాయం, పంట రుణాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసేందుకు కొర్రీలు పెట్టకుండా ఉంటే బాగుడేందని వెల్లడిస్తున్నారు. గత ఐదారేళ్ల నుంచి వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడింది. ప్రతి పని యంత్రాలతో చేయాలంటే ఖర్చు రెండింతలు అవుతుంది. పెరిగిన ఖర్చులతో రెండు సీజన్‌లో పండిన పంట డబ్బులు పెట్టుబడికే సరిపోతున్నాయి. తమకు మిగిలేది ఎట్లా ?.. కుటుంబం పోషించడం భారంగాఉందని నాగలి పట్టేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం కౌలు రైతులను గుర్తించి 11 నెలల కాలానికి గుర్తింపు కార్డులు ఇస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు. కొత్తగా వ్యవసాయ రంగంలో అడుగు పెట్టేందుకు యువ రైతులు ముందుకు రావడం లేదు. రైతులంటే అప్పులు, కష్టాలు, దళారుల దోపిడీ అనే భావన వ్యక్తం చేస్తున్నారు.
కౌలు విధానం తీసుకరావాలి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలులో ఉన్న కౌలు రైతు చట్టాలను తీసుకురావాలనే డిమాండ్ పెరుగుతుంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు రైతుల గుర్తింపు కోసం మండల స్థాయిలో ప్రత్యేక కమిటీల ఏర్పాటు చేసి వారికి లోన్ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ (ఎల్ఈసీ), క్రాప్ కల్టివేషన్ రైట్ సర్టిఫికెట్ (సీసీఆర్సీ) అందించారు. వీటి సహకారంతో బ్యాంకులు కౌలు రైతులకు పంటల పెట్టుబడికి కావలసిన రుణం క్రాప్ లోన్ రూపంలో మంజూరు చేసేవి. క్రాప్ కల్టివేషన్ రైట్ సర్టిఫికెట్లతో కౌలు రైతులే నేరుగా ప్రభుత్వ మద్దతు ధరకు తమ పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో విక్రయించే వెసులుబాటు కౌలు రైతులకు లభించేది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వ్యవసాయంలో సంభవించిన నష్టాలతో కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడిన సందర్భాలలో మండల స్థాయి అధికారుల కమిటీ రిపోర్టు ఆధారంగా ఆపద్బంధు పథకం కింద మరణించిన కౌలు రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహకారం సైతం అందించాయి. అలాగే కౌలు రైతులు సాగు చేస్తున్న పంటలకు బీమా చేసుకోవడం, పంట నష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి నష్టపరిహారం పొందడంలో ఈ సర్టిఫికెట్లు కౌలు రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది కౌలు రైతుల సమస్యల పై ప్రత్యేకమైన దృష్టి సారించి ఒక శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపెట్టాలని రైతు సంఘాలు ప్రభుత్వాలను కోరుతున్నాయి.






