డాక్టర్లు వస్తలేరు, వచ్చినా మధ్యలోనే వెళ్ళిపోతున్నారు !

by velandi.Saikiran |   (  Updated:2026-07-16 23:00:55  IST  )

ప్రభుత్వ డాక్టర్ల పనితీరుపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

డాక్టర్లు వస్తలేరు, వచ్చినా మధ్యలోనే వెళ్ళిపోతున్నారు !
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ డాక్టర్ల పనితీరుపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రులకు డాక్టర్లు రావడం లేదని, ఒకవేళ వచ్చినా కాసేపు ఉండి ఇంటికి వెళ్లిపోతున్నారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ మధ్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో పలువురు ఎమ్మెల్యేలు డాక్టర్ల అటెండెన్స్ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. నిర్ణీత సమయానికి డాక్టర్లు ఆస్పత్రుల్లో అందుబాటులో లేకపోవడంతో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన వద్ద ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం. అలాగే ఆస్పత్రుల్లో సిరంజీలు, మందులు కూడా ఉండటం లేదంటూ వస్తోన్న ఫిర్యాదులను సైతం ఆయనకు వివరించినట్టు తెలిసింది.

ఇష్టానుసారంగా డ్యూటీకి..

రెండు, మూడు రోజులుగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వ వైద్యసేవలపై జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముందుగా కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు డాక్టర్ల అటెండెన్స్‌పైనే పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. నియోజకవర్గంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో పనిచేసే మెజార్టీ డాక్టర్లు నిర్ణీత సమయానికి రావడం లేదని, క్రమశిక్షణ లోపించిందంటూ ఆయనకు వివరించినట్టు సమాచారం.‘రూ.కోట్లు ఖర్చు పెట్టి ఆస్పత్రులు పెడితే ఏం లాభం? డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు. కొందరు ఉదయం వచ్చి మధ్యాహ్నం వెళ్లిపోతున్నరు. కొందరు అసలే రారు. డాక్టర్లు ఆస్పత్రుల్లో లేకపోతే రోగులు ప్రభుత్వాన్ని తిడుతున్నరు’ అని ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో మంత్రి దామోదర డాక్టర్ల అటెండెన్స్‌పై నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించినట్టు సమాచారం.

పర్యవేక్షణ లోపం..

సర్కారు డాక్టర్ల అటెండెన్స్‌ను మానిటరింగ్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ సాప్ట్ వేర్ తయారు చేసింది. ప్రతి డాక్టర్ అసుపత్రికి వచ్చిన వెంటనే ఆన్‌లైన్‌లో అటెండెన్స్ తప్పనిసరిగా నమోదు చేయాలి. డ్యూటీ ముగిసి ఇంటికి వెళ్లే ముందు కూడా హాజరు వేయాలి. అందుకోసం అన్ని ఆస్పత్రుల్లో ఫేషియల్ రికగ్ననైజేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఆ అటెండెన్స్ ఆధారంగానే డాక్టర్ల జీతాలు, ప్రమోషన్లు ఇస్తుంటారు. కానీ మెజార్టీ డాక్టర్లు ఫేషియల్ రికగ్ననైజేషన్ అటెండెన్స్‌ను సైతం పట్టించుకోవడం లేదు. ‘కొందరు డాక్టర్లు ఉదయం లేట్‌గా వస్తారు. కొందరు వచ్చినా రెండు మూడు గంటల కంటే ఎక్కువసేపు ఆస్పత్రుల్లో ఉండరు. కొందరు కేవలం ఉదయం పూట మాత్రమే అటెండెన్స్ వేస్తరు’ అని వైద్యశాఖలోని ఓ సీనియర్ ఆఫీసర్ వివరించారు. ఈ విషయం జిల్లాస్థాయి అధికారుల నుంచి మొదలుకుని రాష్ట్రస్థాయి అధికారుల వరకు తెలుసు. అయినా ఎవరిపై ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడంతో డాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా డ్యూటీలకు వస్తున్నట్టు ఆరోపణలున్నాయి.

Next Story