- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాజెక్టుల అంచనాలు భారీగా పెంచుతూ ప్రపోజల్స్
పెండింగ్‌లో ఉన్న ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించగా.. వాటిని పూర్తిచేసేందుకు అంచనాలను భారీగా పెంచుతూ రాష్ట్ర నీటి పారుదల శాఖ జాబితాను రూపొందించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : పెండింగ్‌లో ఉన్న ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించగా.. వాటిని పూర్తిచేసేందుకు అంచనాలను భారీగా పెంచుతూ రాష్ట్ర నీటి పారుదల శాఖ జాబితాను రూపొందించింది. భారీ స్థాయిలో అంచనాలను పెంచుతూ ప్రభుత్వానికి నివేదికను పంపించినట్టు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆమోదించిన వ్యయ అంచనాలతో పోలిస్తే దాదాపు రూ.1,26,960 కోట్ల మేర అదనపు వ్యయాన్ని ప్రతిపాదిస్తూ నీటిపారుదల శాఖ సమగ్ర నివేదికను సిద్ధం చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం నీటిపారుదల శాఖ రూపొందించిన జాబితా ప్రకారం.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదించిన రూ.1,64,168 కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని రూ.2,91,128 కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది. అంటే మొత్తం వ్యయం దాదాపు 77 శాతం మేర పెరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే గతం కంటే రూ.1,26,960 కోట్లను అదనంగా పెంచుతూ అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేసినట్టు సమాచారం. మొత్తం 29 ప్రాజెక్టులకు సంబంధించి ఈ సవరించిన అంచనాలను రూపొందించినట్టు తెలిసింది.
నాలుగు ప్రాజెక్టులకే రూ.35 వేల కోట్లు పెంపు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటిపారుదల ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష చేపట్టింది. వివిధ ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ, పర్యావరణ అనుమతులు, కోర్టు కేసులు, ధరల పెరుగుదల, డిజైన్ మార్పులు, పెరిగిన నిర్మాణ వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తాజా అంచనాలను రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం లక్ష్యం కొత్త ప్రాజెక్టులను ప్రకటించడమే కాకుండా, ఇప్పటికే ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న ప్రధాన సాగునీటి పథకాలను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. సవరించిన అంచనాల్లో అత్యధికంగా నాలుగు ప్రధాన ప్రాజెక్టుల వ్యయమే పెరిగినట్టు తెలుస్తోంది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, దేవాదుల, పాలమూరు–రంగారెడ్డి, ఎస్ఎల్‌బీసీ వంటి ప్రధాన పథకాలతో పాటు గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో కొనసాగుతున్న ఇతర ప్రాజెక్టులకు కూడా వ్యయ అంచనాలు పెంచినట్టు సమాచారం. ఈ నాలుగు ప్రధాన ప్రాజెక్టులకే దాదాపు రూ.35 వేల కోట్ల అదనపు వ్యయాన్ని ప్రతిపాదించినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
గోదావరి, కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులకు సవరణలు
కేవలం ఒకటి రెండు ప్రాజెక్టులకు మాత్రమే కాకుండా గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న దాదాపు అన్ని ప్రధాన నీటిపారుదల పథకాల వ్యయాలను సవరించినట్టు తెలుస్తోంది. వీటిలో ముఖ్యంగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, సీతమ్మసాగర్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, గౌరవెల్లి, ఇతర ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం.
వ్యయం ఎందుకు పెరిగింది?
గత బీఆర్ఎస్ హయాంలో రూపొందిన ప్రాజెక్టు వ్యయానికి, ఇప్పటితో పోలిస్తే సుమారుగా రూ.1,26,960 కోట్లు అధికంగా ప్రతిపాదించారు. ఇంత పెద్ద మొత్తంలో అంచనాలు పెరగడానికి కారణాలూ లేకపోలేదు. ప్రధానంగా సిమెంట్, స్టీల్, డీజిల్ తదితర నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల, భూసేకరణ, పునరావాసం (ఆర్అండ్ఆర్) వ్యయం పెరగడం, పర్యావరణ, అటవీ అనుమతుల ఆలస్యం, కోర్టు కేసుల కారణంగా పనులు నిలిచిపోవడం, డిజైన్ మార్పులు, అదనపు నిర్మాణ అవసరాలు, కాంట్రాక్ట్ కాలం పొడిగింపు వల్ల వ్యయం పెరగడం, ద్రవ్యోల్బణ ప్రభావం తదితర కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తాజా అంచనాలను రూపొందించినట్టు సమాచారం.
నేడు కేబినెట్ ముందుకు ఫైల్..
నీటి పారుదల శాఖ అధికారులు సవరించిన అంచనాలను నేడు కేబినెట్ ముందుకు పంపిస్తున్నట్టు తెలిసింది. నేటి కేబినెట్‌లో ప్రధానంగా సవరించిన అంచనాలకు ఆమోదంపైనే చర్చించనున్నట్టు తెలిసింది. అందులోనూ ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాజెక్టులుగా తీసుకున్న ఎస్ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల సవరించిన అంచనాలకు గ్రీన్ సిగ్నల్ తెలుపనున్నట్టు తెలుస్తు్న్నది. మిగతా వాటి మీద తదుపరి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఈ నాలుగు ప్రాజెక్టులను మాత్రం ప్రాధాన్యత అంశంగా చర్చించి.. వాటికి ఆమోదం తెలుపుతారని సమాచారం.






