సీఎం ఆదేశాలు బేఖాతర్..ఆ ఉద్యోగులకు జీతాలు రాలే

by velandi.Saikiran |   (  Updated:2026-07-03 22:15:46  IST  )

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను సెక్రటరీలు,హెచ్ఓడీలు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

సీఎం ఆదేశాలు బేఖాతర్..ఆ ఉద్యోగులకు జీతాలు రాలే
X

దిశ,తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను సెక్రటరీలు,హెచ్ఓడీలు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. రెగ్యూలర్ ఎంప్లాయీస్ తో సమానంగా ఒకటో తేదీన కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు సైతం జీతాలు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను అధికారులు పెడచెవిన పెట్టారు. దీనితో సగం మందికి మాత్రమే ఈనెల1న జీతాలు అందాయి. మిగతా ఎంప్లాయీస్ తమ అకౌంట్స్ లో ఎప్పుడు డబ్బులు పడుతాయోనని ఎదురుచూస్తున్నారు. అయితే వివిధ శాఖల సెక్రటరీలు,హెచ్ఓడీల నిర్లక్ష్యమే కారణంగా ఒకటో తేదీన అందరికి జీతాలు అందలేదని తెలుస్తున్నది. ఈ విషయం తెలుసుకున్న సీఎంవో అధికారులు ఏఏ శాఖల్లో ఎంత మందికి జీతాలు పడ్డాయి? ఎందరికి అందలేదు? అందుకు కారణాలు ఏంటీ? అని ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

2.70 లక్షల మందికి జీతాలు రాలే

వివిధ శాఖల్లో సుమారు ఐదు లక్షల మంది ఉద్యోగులు కాంట్రాక్ట్,అవుట్ సోర్సింగ్ పద్దతన పనిచేస్తున్నారు. వీరందరికి జీతాలు సక్రమంగా చెల్లించడం లేదు. కొందరికి నెల చివరన,ఇంకొందరికి రెండు నెలలకొసారి, మరికొందరికి మూడు నెలలకు ఓసారి చెల్లిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి రెగ్యూలర్ ఎంప్లాయీస్ కు తరహాలోనే ప్రతినెల 1న జీతాలు చెల్లించాలని ఆదేశించారు. దీనితో జూన్ నెల జీతాలను జులై1న చెల్లించేందుకు ఆర్థిక శాఖ పక్షం రోజల ముందు నుంచి కసరత్తు ప్రారంచింది. కాని సెక్రటరీలు,హెచ్ఓడీల నుంచి సహకారం లేకపోవడంతో జులై ఒకటో తేదీన కేవలం 2.70 లక్షల మందికి మాత్రమే జీతాలు అందినట్లు తెలిసింది. అందులో 30 శాతం మంది కాంట్రాక్ట్,70 శాతం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా మెడికల్ అండ్ హెల్త్,హోం శాఖ,పంచాయితీ రాజ్, ఎడుకేషన్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖల్లో సగం మందికి కూడా జీతాలు అందలేదని తెలుస్తున్నది.

సెక్రటరీలు,హెచ్ఓడీల అలసత్వం

ప్రతినెల ఒకటో తేదీన కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు జీతాలు చెల్లించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను అదేశించారు. దీనితో ఆ శాఖ అధికారులు జీతాలు చెల్లించేందుకు కావాల్సిన కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా జూన్ 25లోపు కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సాలరీ బిల్లులు పంపాలంటూ అన్ని శాఖల సెక్రటరీలు,హెచ్ఓడీలకు జూన్ రెండోవారంలో సర్క్యూలర్ పంపారు. ఆ సర్క్యూలర్ ప్రకారం కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ ఎజెన్సీల ను అలర్ట్ చేసి ఆయా ఎజెన్సీల్లో పనిచేస్తోన్న ఎంప్లాయీస్ అటెంటెన్స్ ను సేకరించి,బిల్లులు చేసి ఆర్థిక శాఖకు పంపాలి. కాని మెజార్టీ శాఖల సెక్రటరీలు,హెచ్ఓడీలు సీరియస్ గా తీసుకోకపోవడం, ఇంకొందరు ఆసలు ఫాలో ఆఫ్ చేయకపోవడంతో సగం మందికి మాత్రమే జులై 1న జీతాలు అందినట్లు అధికార వర్గాల్లో డిస్కషన్ జరుగుతున్నది.

సీన్ రివర్స్

మొన్నటి వరకు కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు చెల్లించాలంటూ ఆయా శాఖలు ఆర్థిక శాఖ వెంటాపడేవారు. కాని నిధుల కొరత,విధానపరమైన నిర్ణయాల కారణంగా జీతాలు చెల్లింపు ఆలస్యంగా జరిగేది. కాని సీఎం రేవంత్ రెడ్డి ప్రతినెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలంటూ ఆదేశించిన తరువాత ఆర్థిక శాఖ అన్ని శాఖల వెంటా పడటం మొదలైంది. ‘‘జీతాలు చెల్లించేందుకు రెడీగా ఉన్నాం.. మీరు సకాలంలో బిల్లులు పంపండి’’అంటూ ఆర్థిక శాఖకు చెందిన అధికారులు అన్ని శాఖలను ఫాలోఆఫ్ చేస్తున్నారు.కాని కొన్ని శాఖల అధికారులు మాత్రమే ఇన్ టైమ్ లో బిల్లులు ఆర్థిక శాఖకు పంపారు.

రంగంలోకి దిగిన సుల్తానియా

పూర్తి స్థాయిలో కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు అందలేదని విషయాన్ని తెలుసుకున్న సీఎంవో అధికారులు అన్ని శాఖల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఏ శాఖలో ఎందుకు జాప్యం జరిగిందో ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే స్వయంగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుల్తానియా రంగంలోకి, సెక్రటరీల వాట్సప్ గ్రూపులో జీతాలు అందని శాఖలు,విభాగాల వివరాలు పంపాలంటూ మెసేజ్ చేసినట్లు తెలిసింది. దీనితో అలర్ట్ అయిన అన్ని శాఖల సెక్రటరీలు తమ హెచ్ఓడీలకు ఫోన్లు చేసి,జీతాలు అందని ఉద్యోగుల వివరాలు,అందుకు కారణాలు పంపాలంటూ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

Next Story