- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sanathnagar TIMS: సౌకర్యాలపై ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్య సంతృప్తి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాల మేరకు సనత్‌నగర్‌లోని టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాల సముదాయాన్ని రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి పి.ప్రావీణ్య మంగళవారం పరిశీలించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాల మేరకు సనత్‌నగర్‌లోని టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాల సముదాయాన్ని రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి పి.ప్రావీణ్య మంగళవారం పరిశీలించారు. ఆసుపత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేసి ఆసుపత్రిని వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆసుపత్రిలో ట్రయల్ రన్ విధానంలో ప్రారంభమైన అవుట్ పేషెంట్ సేవలను ప్రవీణ్య పరిశీలించారు. ఆసుపత్రిలోని మొత్తం 29 విభాగాలకు గాను ప్రస్తుతం 22 విభాగాల్లో ఓపీ సేవలు కొనసాగుతున్నాయి. కన్సల్టేషన్ గదులు, రోగులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రత్యేక కార్యదర్శి సేవల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్య సేవలు, విభాగాల పనితీరు, వ్యాధి నిర్ధారణ, చికిత్స కోసం ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాల గురించి వైద్య ఆరోగ్య శాఖ నోడల్ ఆఫీసర్ డాక్టర్ మహబూబ్ ఖాన్ ఆమెకు వివరించారు.
గుండె సంబంధిత వైద్య సేవలు..
సనత్‌నగర్ టిమ్స్ ప్రధానంగా గుండె సంబంధిత వైద్య సేవలు, అవయవ మార్పిడి రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా రూపుదిద్దుకుంటోందని ఆయన తెలిపారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ, రోడ్లు భవనాల శాఖ, తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సమన్వయంతో చేపడుతున్న పనుల పురోగతిపై ప్రవీణ్య సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి పూర్తిస్థాయి కార్యకలాపాలకు ఆటంకంగా ఉన్న పెండింగ్ పనులను ఈపీసీ కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ ప్రతినిధులతో కలిసి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేసి లోపాలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ జి. రాజేశ్వర్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజనీర్ వై. లింగారెడ్డి, ఇతర ఆర్ అండ్ బీ ఇంజనీర్లు, టీజీఎంఎస్ఐడీసీ అధికారులు, మేఘా ఇంజినీరింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.






