- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Special Officers: ఇక ‘మున్సిపల్’లో స్పెషల్ ఆఫీసర్ల పాలన..!
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన రానున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన రానున్నది. ఈ నెల 26న 130 పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగియనున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వాటిని ప్రత్యేక అధికారుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. మున్సిపాలిటీలకు ఆర్డీవోలు, మున్సిపల్ కార్పొరేషన్‌లకు కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇందుకు సంబంధించి మున్సిపల్‌శాఖ ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది. మున్సిపల్ శాఖ సీఎం రేవంత్ వద్దే ఉన్నది. ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. సీఎం రాష్ట్రానికి వచ్చేలోగా అధికారులు ఏర్పాట్లన్నీ సిద్ధం చేస్తున్నారు. ఆయన వచ్చిన వెంటనే సంబంధిత ఫైల్‌పై సంతకం చేయనున్నారు.
వీటితో పాటే కొత్త వాటికి సైతం ఎన్నికలు
గతంలో రాష్ట్రంలో 142 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా.. 130 పట్టణ స్థానిక సంస్థలకు 2020లో ఎన్నికలు నిర్వహించారు. వీటి గడువు ఈ నెలలో ముగుస్తుంది. మరో 8 స్థానిక సంస్థల (జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు)కు 2021లో ఎలక్షన్స్ జరిగాయి. వీటి పదవీ కాలం వచ్చే ఏడాది పూర్తికానున్నది. మరో నాలుగు స్థానిక సంస్థలకు (జహీరాబాద్ సహా మూడు షెడ్యూల్ఏరియా మున్సిపాలిటీలు) ఎన్నికలు నిర్వహించలేదు. మరోవైపు కొత్తగా 12 మున్సిపాలిటీలు ఏర్పడగా సంఖ్య 154కు చేరుకుంది. ఇంకో వైపు రెండు మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న పట్టణ స్థానిక సంస్థలతో పాటుగానే కొత్తగా ఏర్పాటైన వాటికి కలిపి ఎన్నికలు జరగనున్నాయి.
స్పెషల్ ఆఫీసర్లుగా కలెక్టర్లు, ఆర్డీవోలు
పాలక వర్గాల గడువు ముగుస్తున్న పట్టణ స్థానిక సంస్థల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన రానున్నది. అత్యవసర, రెగ్యులర్ జరిగే పనున్నంటికీ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రత్యేకాధికారులు చర్యలు చేపట్టనున్నారు. కీలక అభివృద్ధి పనులు జరగాలంటే కౌన్సిల్ తీర్మాణం తప్పనిసరి కావడంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం పూర్తికాగానే పట్టణాల్లోనూ ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు టాక్.






