మరింత పటిష్టంగా టీజీ విద్యుత్ రంగం.. సమగ్ర కార్యాచరణ అమలు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో విద్యుత్ రంగాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు సమగ్ర కార్యాచరణను అమలు చేస్తున్నట్లు టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ తెలిపారు...

మరింత పటిష్టంగా టీజీ విద్యుత్ రంగం.. సమగ్ర కార్యాచరణ అమలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో విద్యుత్ రంగాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు సమగ్ర కార్యాచరణను అమలు చేస్తున్నట్లు టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ తెలిపారు. విద్యుత్ డిమాండ్‌లో సంభవించే పెరుగుదలను ముందుగానే అంచనా వేసి, రాష్ట్రంలోని ప్రతి గృహం, రైతు, పరిశ్రమ, వాణిజ్య సంస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం, ఇంధన శాఖ, టీజెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. దశాబ్దాల క్రితం నిర్మించిన సబ్‌స్టేషన్లను ఆధునీకరిస్తూ, మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ నమూనాలో అత్యాధునిక మోడల్ సబ్‌స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రిమోట్ మానిటరింగ్, రిమోట్ ఆపరేషన్, డిజిటల్ కంట్రోల్ సిస్టమ్స్, ఆటోమేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దశలవారీగా అమలు చేస్తున్నామని వివరించారు.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సబ్‌స్టేషన్లలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బెస్) ఏర్పాటు, సౌర విద్యుత్ ఉత్పత్తి విస్తరణ, విద్యుత్ నిల్వ సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పగటిపూట ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్‌ను నిల్వ చేసి అవసరమైన సమయంలో వినియోగించే విధానాలను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరిగినా రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. హైడల్ విద్యుత్ ఉత్పత్తి, థర్మల్ కేంద్రాల పనితీరు, బొగ్గు నిల్వలు, విద్యుత్ కొనుగోళ్లు వంటి అంశాలను రోజువారీగా సమీక్షిస్తున్నామని తెలిపారు.

వ్యవసాయానికి ఎలాంటి సమస్య లేకుండా విద్యుత్ సరఫరా...

వ్యవసాయ రంగానికి నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని సీఎండీ తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండటంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భూగర్భ జలాల పరిరక్షణతో పాటు నీటి పొదుపు పద్ధతులను రైతులు పాటించాలని సూచించారు. గృహ, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ వినియోగం ఏటా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త సబ్‌స్టేషన్లు, అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్ల బలోపేతం, వోల్టేజ్ మెరుగుదల పనులను వేగవంతం చేశామని తెలిపారు. ప్రజలకు విశ్వసనీయమైన, నాణ్యమైన విద్యుత్ సేవలను మరింత సమర్థవంతంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

డిజిటల్ మ్యాపింగ్, ఫీడర్–డీటీఆర్–వినియోగదారుల మ్యాపింగ్, రియల్‌టైమ్ మానిటరింగ్, ఫాల్ట్ లొకేషన్ సిస్టమ్స్, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత విద్యుత్ నిర్వహణ, లోడ్ అంచనా, అవుటేజ్ విశ్లేషణ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యుత్ పంపిణీ వ్యవస్థలో విస్తృతంగా ప్రవేశపెడుతున్నామని తెలిపారు. వినియోగదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు డిజిటల్ సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ప్రజలు విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడంతో పాటు విద్యుత్ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీఎండీ విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు 1912 కాల్ సెంటర్, అధికారిక వాట్సాప్ సేవలు, టీజీఎస్‌పీడీసీఎల్ డిజిటల్ వేదికలను వినియోగించాలని కోరారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా, నాణ్యమైన విద్యుత్ సేవలే విద్యుత్ శాఖ లక్ష్యంగా, ఆధునిక సాంకేతికతతో తెలంగాణ విద్యుత్ రంగాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ స్పష్టం చేశారు.

Next Story