హైదరాబాద్-జకార్తా మధ్య టెక్నాలజీ స్కిల్ కారిడార్

by Gantepaka Srikanth |

హైదరాబాద్-జకార్తా నగరాల మధ్య సాంకేతిక నైపుణ్యాల మార్పిడి కోసం ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.

హైదరాబాద్-జకార్తా మధ్య టెక్నాలజీ స్కిల్ కారిడార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్-జకార్తా నగరాల మధ్య సాంకేతిక నైపుణ్యాల మార్పిడి కోసం ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇండోనేషియా డిజిటల్ పరివర్తన ప్రయాణంలో టెక్నాలజీ హబ్‌గా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న తెలంగాణ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గురువారం న్యూఢిల్లీ భారత్ మండపంలో నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఇండోనేషియా కమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ అఫైర్స్ వైస్ మినిస్టర్ నెజార్ పాత్రియా నేతృత్వంలోని అత్యున్నత స్థాయి బృందంతో మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ, ఇండోనేషియా మధ్య డిజిటల్ భాగస్వామ్యం, స్కిల్ డెవలప్మెంట్, ప్రతిభావంతుల గుర్తింపు, టెక్నాలజీ ఇన్నోవేషన్స్, స్టార్టప్ ఎకో సిస్టం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్-జకార్తా టెక్నాలజీ స్కిల్స్ డెవలప్‌మెంట్ కారిడార్ ఏర్పాటుకు చొరవ చూపాలని నెజార్ పాత్రియా విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియా అమలు చేస్తున్న నేషనల్ డిజిటల్ రోడ్‌మ్యాప్‌కు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించాలని కోరారు. తమ అంకుర సంస్థలకు, స్టార్టప్ ఎకో సిస్టం బలోపేతానికి మార్గ నిర్దేశం చేయాలని ఆహ్వానించారు. ఇండోనేషియా ప్రతిపాదనలపై మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించారు. ఇండోనేషియా డిజిటల్ పరివర్తనలో తెలంగాణ కీలక భాగస్వామిగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ టెక్ టాలెంట్‌ను ఇండోనేషియా డిజిటల్ అవసరాలకు అనుగుణంగా అనుసంధానం చేస్తామన్నారు. కృత్రిమ మేధ వినియోగంలో నైతిక ప్రమాణాలు, పాలసీల రూపకల్పనలో సహకరిస్తామన్నారు.

ఏఐ భద్రతే ప్రథమ ప్రాధాన్యం

ఏఐ రంగంలో భద్రతకు ప్రభుత్వం ఆవిష్కరణలకు అడ్డంకిగా కాకుండా 21వ శతాబ్దపు ఏరోడైనమిక్స్‌గా భావిస్తున్నదని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. డిజిటల్ గవర్నెన్స్ అడ్వయిజరీ, ఆల్ బ్రైట్ స్టోన్‌బ్రిడ్జ్ గ్రూప్ లాంటి గ్లోబల్ స్ట్రాటెజిక్ అడ్వయిజరీ సంస్థల ప్రతినిధులు, ఏఐ సేఫ్టీ కనెక్ట్ సంస్థల నిపుణులను ఉద్దేశించి ఆయన కీలకోపన్యాసం చేశారు. నియంత్రణలు లేకుండా సాధించే వేగవంతమైన వృద్ధి త్రైమాసిక నివేదికల్లో అద్భుతంగా కనిపించవచ్చని.. కానీ సరైన భద్రతా చర్యలు లేకుంటే జరిగే చిన్న పొరపాటు దశాబ్దాలుగా సంపాదించుకున్న ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని మంత్రి హెచ్చరించారు. ప్రస్తుతం 80 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న హైదరాబాద్ వృద్ధిలో సగానికి పైగా మన టెక్ నిపుణుల కృషితోనే సాధ్యమైందన్నారు. 1980లలో చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న చైనాలోని షెన్‌జెన్.. ఆ సమయంలో తయారీ రంగంపై దృష్టి సారించి నేడు 500 బిలియన్ డాలర్ల దిగ్గజ నగరంగా ఎదిగిందని ఉదహరించారు. తెలంగాణ కూడా ఇప్పుడు అటువంటి షెన్‌జెన్ ఘట్టంలోనే ఉన్నదన్నారు. ప్రపంచంలోనే అగ్రగామి ఏఐ హబ్‌గా ఎదగడం ద్వారా 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రోయాక్టివ్ గవర్నెన్స్‌లో భాగంగా 2027 నాటికి ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సర్వీసెస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా 4 కోట్ల మంది పౌరులకు 300కు పైగా ప్రభుత్వ సేవలను అరచేతిలోనే అందించనున్నామని తెలిపారు. మూసీ నది పునరుజ్జీవం నుంచి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తరగతి గదుల వరకు భవిష్యత్తు కోసం 15 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడుతున్నామన్నారు. ఏఐ భద్రతా ప్రమాణాల కోసం గ్లోబల్ సౌత్ దేశాలు మరెక్కడో రాసే నిబంధనల కోసం ఎదురుచూడటం లేదని, 40 మిలియన్ల ప్రజల కోసం ఇక్కడే ఆ ప్రమాణాలను రియల్ టైమ్‌లో తాము రచిస్తున్నామని మంత్రి తేల్చిచెప్పారు.

అమెరికా పెట్టుబడిదారులకు అవకాశాలు

కృత్రిమ మేథకు సంబంధించిన నూతన ఆవిష్కరణల వేదికగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం అమెరికా పెట్టుబడిదారులకు అనేక అవకాశాలను కల్పిస్తున్నదని మంత్రి వెల్లడించారు. ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026లో భాగంగా దేశ రాజధానిలో అమెరికా-ఇండియా వాణిజ్య మండలి ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సదస్సులో కీలకోపన్యాసం చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అత్యున్నత టెక్నాలిజీ ఎకో సిస్టం రాష్ట్రంలో నూతన అవకాశాలను సృష్టించిందని తెలిపారు. అమెరికా టెక్ దిగ్గజాలతో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఇప్పటికే తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. సమావేశంలో యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ ఎంగేజ్‌మెంట్ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జోర్డాన్ క్రెన్ షా, యూఎస్ ఐబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాకబ్ గులిష్, తెలంగాణ ఐటీ అడ్వయిజర్ సాయికృష్ణా, మీ సేవ కమిషనర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story