నగరంలో SIR కోసం స్పెషల్ హెల్ప్‌డెస్క్‌లు.. కేంద్రాల పూర్తి జాబితా ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-03 08:19:46  IST  )

హైదరాబాద్‌లో 'SIR' అప్లికేషన్ ఫారమ్‌ల దాఖలును సులభతరం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం 16 ప్రత్యేక హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసింది.

నగరంలో SIR కోసం స్పెషల్ హెల్ప్‌డెస్క్‌లు.. కేంద్రాల పూర్తి జాబితా ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో SIR ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఫారమ్‌లను ఎలాంటి తప్పులు లేకుండా సులువుగా నింపుకునేలా ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగానే నగరవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 16 ప్రత్యేక హెల్ప్ డెస్కులను (Help Desks) ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది.

ఈ హెల్ప్ డెస్కులను ప్రజలకు అందుబాటులో ఉండేలా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రధాన మున్సిపల్ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలలో ఏర్పాటు చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి దోమలగూడ మున్సిపల్ కార్యాలయంలో, మలక్‌పేట్ పరిధిలోని గవర్నమెంట్ క్వార్టర్స్ మున్సిపల్ కార్యాలయంలో ఈ కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా అంబర్‌పేట్, గోషామహల్ నియోజకవర్గాల ప్రజల కోసం అబిడ్స్ పార్కింగ్ కాంప్లెక్స్‌లోని వరుసగా 6వ, 4వ అంతస్తులలో ఈ హెల్ప్ డెస్కులను కేటాయించారు. ఖైరతాబాద్ మున్సిపల్ కార్యాలయం 1వ అంతస్తులో ఖైరతాబాద్ వాసుల కోసం, 2వ అంతస్తులో కార్వాన్ నియోజకవర్గ ప్రజల కోసం కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద, సనత్‌నగర్‌కు హరిహర కళాభవన్‌లో, నాంపల్లి నియోజకవర్గానికి గుడిమల్కాపూర్ లోని సాయిబాబా ఆలయం ఎదురుగా ఈ హెల్ప్ డెస్కులు సేవలందించనున్నాయి. పాతబస్తీ పరిధిలోని చార్మినార్ నియోజకవర్గానికి మొఘల్‌పురా మున్సిపల్ కార్యాలయం, చాంద్రాయణగుట్టకు జంగమ్మెట్ మున్సిపల్ కార్యాలయం, యాకుత్‌పురా, బహదూర్‌పురా నియోజకవర్గాల ప్రజల కోసం పూల్‌బాగ్ మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

సికింద్రాబాద్ ప్రాంత నివాసితులు సికింద్రాబాద్ కోర్టు పక్కన ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని, కంటోన్మెంట్ పరిధిలోని వారు సీఈఓ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. వీటితో పాటు ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ కార్యాలయంలోనూ ఒక ప్రత్యేక హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. 'SIR' ఫారమ్‌లను ఎలా నింపాలో తెలియక ఇబ్బంది పడే ప్రజలకు ఈ కేంద్రాల వద్ద ఉన్న సిబ్బంది పూర్తి స్థాయిలో మార్గదర్శకత్వం వహించి సాయం చేయనున్నారు.

Next Story