- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవాస్తవిక అందాల ఆరాటంలోయువత..! సోషల్ మీడియానే కారణమా?
పర్ఫెక్ట్ బాడీ ఇమేజింగ్ భావనలతో యువతలో ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం తగ్గుతున్నాయి.

దిశ, ఫీచర్స్ : నిజానికి పర్ఫెక్ట్ అందం, పర్ఫెక్ట్ పర్సనాలిటీ, పర్ఫెక్ట్ శరీర ఆకృతి వంటివేవీ ఉండవు. ఇవన్నీ పర్సన్ టు పర్సన్ వేర్వేరుగా ఉంటాయి. ఎవరి అందం వారికి, ఎవరి శరీర ఆకృతి వారికి ప్రత్యేకం. కానీ ఇటీవల మితిమీరిన ఫ్యాషన్ పోకడలు, సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, సినిమాల ప్రభావాలు, యువతలో ఇందుకు భిన్నమైన దృక్పథాలను ప్రేరేపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే స్లిమ్‌గా, జీరో సైజ్ బాడీ ఇమేజ్ కలిగి ఉంటేనే అందమని, పురుషుల విషయానికి వస్తే కండలు తిరిగిన శరీర ఆకృతే అందమనే భావనలను ప్రేరేపించే వ్యాపార ప్రకటనలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ఇవన్నీ యువతను, ముఖ్యంగా టీనేజర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయని, ‘పర్ఫెక్ట్’గా లేమనే భావనతో వారిలో ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం తగ్గడానికి దారితీస్తున్నాయని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.
అలా పోల్చుకోవడమే సమస్య!
ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. టీనేజర్లలో చాలామంది ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. అయితే అందులో పర్ఫెక్ట్ బాడీ, ఫ్లాట్ స్టమక్, గ్లోయింగ్ స్కిన్‌తో నిండిన ఫోటోలు చూసి తనను తాను పోల్చుకునే వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారని సోషల్ సైకాలజిస్టులు పేర్కొంటున్నారు. “నా శరీరం ఎందుకు ఇలా ఉంది?” అని మనసులో అనుకోవడం, అదే విషయమై పదే పదే ఆలోచించడం, ఇతరులతో పోల్చుకోవడం వంటి కారణాలతో క్రమంగా ఆత్మవిశ్వాసం తగ్గిపోతోందని చెబుతున్నారు. ఇక విద్యార్థులైతే క్లాసులో లెక్చర్ వింటున్నా, కొన్నిసార్లు ఇటువంటి పర్ఫెక్ట్ బ్యూటీ, పర్ఫెక్ట్ బాడీ ఇమేజెస్ వంటివి గుర్తుకు వచ్చి ఏకాగ్రతను కోల్పోతున్న పరిస్థితులు నేడు నెలకొంటున్నాయి. దీంతో చదువు మీద దృష్టి చేయలేక ఇబ్బందులు పడుతుంటారు. ఇలా సోషల్ మీడియాలో రోజూ వచ్చే అవాస్తవిక అందం(Unreal beauty) ప్రమాణాలు యువతరం మనసులను గందరగోళానికి గురిచేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
పర్ఫెక్ట్ భావనలతో సమస్యలు-పరిష్కారాలు
సోషల్ మీడియాలో లేదా సినిమాల్లో చూపించే లేదా తాము తరచుగా చూసే పర్ఫెక్ట్ బాడీ ఇమేజింగ్ భావనలతో నేటి యువతలో, ముఖ్యంగా అమ్మాయిల్లో అనేకమంది తమ శరీరం గురించి అసంతృప్తి, ఆందోళన, తాము తక్కువ అనిపించే భావనలకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేవారు ఒకప్పుడు స్నేహితులతో సరదాగా గడిపే సమయాలను కూడా ఒంటరిగా గడుపుతూ ప్రస్తుతం“నేను బాగా లేను” అనే ఆలోచనలతో నిండిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటిప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఆందోళన, ఒత్తిడి పెరగడం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మ విశ్వాసం వంటివి తగ్గిపోవడం సంభవిస్తాయని అంటున్నారు. అందుకే యువతలో ‘పర్ఫెక్ట్ బాడీ ఇమేజింగ్’ మానసిక లక్షణాలను గుర్తిస్తే పేరెంట్స్ వెంటనే అలర్ట్ అవ్వాలని, సోషల్ మీడియాలో, సినిమాల్లో ఇతర వేదికల్లో వచ్చేవి కేవలం ఫిల్టర్లు, ఎడిటింగ్‌తో సృష్టించిన మాయా ప్రపంచం అనే విషయాలను వారికి అర్థం అయ్యేలా వివరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడు కూడా బాధిత యువతలో మార్పు కనిపించకపోతే సైకాలజిస్టుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించడం వంటివి చేయాలని చెబుతున్నారు.






