- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంకులో డబ్బులు లేవు... కుర్చీల్లో సిబ్బంది లేరు
కోనరావుపేట యూనియన్ బ్యాంకులో డబ్బులు లేక రైతుల అరిగోసపడుతున్నారు.

దిశ, కోనరావుపేట: కష్టపడి పండించిన వడ్ల పైసలు చేతికొచ్చాయన్న సంతోషం ఆ రైతన్నల్లో ఎంతోసేపు నిలవలేదు. బ్యాంకుకు వెళ్తే రూపాయి చేతికి అందక, అడిగితే సమాధానం చెప్పే నాథుడు లేక కోనరావుపేట మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో రైతులు, వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటీవలే వడ్ల డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో, వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు శుక్రవారం భారీ సంఖ్యలో ఖాతాదారులు బ్యాంకుకు చేరుకున్నారు. అయితే, తీరా బ్యాంకు లోపలికి వెళ్లాక "డబ్బుల కొరత ఉంది" అంటూ సిబ్బంది చేతులెత్తేయడంతో రైతులు షాక్‌కు గురయ్యారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయానికే బ్యాంకులో కనీసం సిబ్బంది కూడా సీట్లలో లేకపోవడం గమనార్హం. కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తుండడంతో.. "అసలు స్టాఫ్ అంతా ఎటు వెళ్లారు?" అని ఖాతాదారులు ప్రశ్నిస్తే, అక్కడ ఉన్న కొద్దిమంది సిబ్బంది "ఏమో చూడు" అంటూ అత్యంత బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం గమనార్హం.
కనీస మర్యాద లేకుండా..
దూరప్రాంతాల నుండి ఆశతో వచ్చిన వృద్ధులు, మహిళలు, రైతులు బ్యాంకు చుట్టూ గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. తమ సమస్యను చెప్పుకుందామని వెళ్లిన ఖాతాదారుల పట్ల బ్యాంకు మేనేజర్ యాదగిరి అత్యంత దురుసుగా, అహంకారంతో ప్రవర్తిస్తున్నాడని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. కనీస మర్యాద లేకుండా, కస్టమర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ మేనేజర్ తీరుపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు, వృద్ధులకు సేవలు అందించాల్సిన బ్యాంకు అధికారులు.. ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, కోనరావుపేట యూనియన్బ్యాంకులో నెలకొన్న నగదు కొరతను తీర్చడంతో పాటు, ఖాతాదారులను మానసిక క్షోభకు గురిచేస్తున్న మేనేజర్ యాదగిరిపై, విధులను నిర్లక్ష్యం చేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల రైతాంగం, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






