షాద్‌నగర్ పట్టణ ప్రధాన చౌరస్తా విస్తరణకు కసరత్తు పూర్తి: ఆర్డీవో సరిత

by Jakkula.Mamatha |

పట్టణ ప్రజల చిరకాల సమస్యకు పరిష్కారం లభించనుంది.

షాద్‌నగర్ పట్టణ ప్రధాన చౌరస్తా విస్తరణకు కసరత్తు పూర్తి: ఆర్డీవో సరిత
X

దిశ, షాద్ నగర్: పట్టణ ప్రజల చిరకాల సమస్యకు పరిష్కారం లభించనుంది. షాద్ నగర్ పట్టణ ప్రధాన చౌరస్తా విస్తరణ పనులను వేగవంతం చేసేందుకు పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. ఈ పరిశీలనలో ఆర్డీవో సరిత, ఏసీపీ లక్ష్మీ నారాయణ, ఫరూఖ్ నగర్ తహశీల్దార్ నాగయ్య, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ సీఐ సీతారాం, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, మున్సిపల్ టీపీఓ పావని,ఆర్ అండ్ బీ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో సరిత మాట్లాడుతూ.. పట్టణ చౌరస్తా విస్తరణలో భాగంగా ముఖ్య కూడలిలో ఉన్న విగ్రహాలను తరలించే ముందు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఏకాభిప్రాయ తీర్మానం చేస్తామని ఆర్డీవో సరిత స్పష్టం చేశారు.

అందరి అంగీకారంతోనే ప్రభుత్వ అనుమతులు తీసుకుని విగ్రహాలు అనువైన ప్రదేశానికి తరలిస్తామని, అనంతరమే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభిస్తామని ఆర్డీవో సరిత తెలిపారు. అనంతరం ఏసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చౌరస్తా లో ఉన్న విగ్రహాల తరలింపు ప్రక్రియను అన్ని శాఖల అనుమతులు, రాజకీయ పార్టీల సమ్మతితో పూర్తి చేసి వాటిని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆర్ అండ్ బీ అధికారులు రోడ్డు మార్కింగ్ పూర్తి చేసి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా విస్తరణ పనులు చేపడతామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, గెజిట్ వివరాలు పరిశీలించి రోడ్డు విస్తరణ పరిమితిపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. ఈ విస్తరణతో పట్టణ చౌరస్తాలో ఏళ్లుగా వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story