- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైరా బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ పదవిపై కొత్త సమీకరణలు..!
వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ నియామకంపై కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

దిశ, వైరా : వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ నియామకంపై కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎస్టీకి రిజర్వ్ అయిన వైరా నియోజకవర్గంలో గిరిజన నేతల మధ్య ఇన్‌చార్జ్ పదవికి తీవ్ర పోటీ నెలకొనడంతో, పార్టీ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించే దిశగా అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. వైరా నియోజకవర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన బానోత్ మదన్ లాల్ అనంతరం బీఆర్ఎస్‌లో చేరగా, 2019లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావుడ్యా రాములు నాయక్ కూడా బీఆర్ఎస్‌లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మాలోత్ రాందాస్ నాయక్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. గత ఏడాది బానోత్ మదన్ లాల్ మరణించిన తర్వాత వైరా నియోజకవర్గానికి శాశ్వత ఇన్‌చార్జ్ లేకపోవడం పార్టీ కార్యకలాపాలపై ప్రభావం చూపింది. తొలుత ఆయన భార్య బానోత్ మంజుల నియోజకవర్గంలో పర్యటించగా, ఇటీవల కుమార్తె బానోత్ మనీషా లక్ష్మీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇదే సమయంలో లకావత్ గిరిబాబు, బానోత్ బాలాజీ నాయక్ కూడా ఇన్‌చార్జ్ పదవిని ఆశిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. గిరిజన నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో పార్టీలో వర్గపోరు మరింత పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, తాత్కాలికంగా ఓసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం రాష్ట్ర నాయకుడు ఆర్జేసీ కృష్ణకు వైరా నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం కూడా ఈ వ్యూహంలో భాగంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కట్టా కృష్ణార్జున్‌రావుకే అవకాశం..?
ఈ ఏడాది జనవరిలో జరిగిన వైరా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కట్టా స్వరూపారాణిని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించగా, ఆమె తరఫున జిల్లా నాయకుడు కట్టా కృష్ణార్జున్‌రావు పార్టీ కోసం విస్తృతంగా పనిచేశారు. ఎన్నికల్లో విజయం దక్కకపోయినా, పార్టీ క్లిష్ట సమయంలో కట్టా కృష్ణార్జున్‌రావు చేసిన కృషిని అధిష్టానం గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల వరకు ఆయనను వైరా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించి, ఎన్నికల సమయంలో పరిస్థితులను బట్టి సమర్థుడైన గిరిజన నేతకు టికెట్ కేటాయించే వ్యూహాన్ని బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.






