ఆ రెండు అంశాలపైనే స్పెషల్ ఫోకస్..! బీఆర్ఎస్ ఎన్నికల ఎజెండా ఫిక్స్?

by Sathputhe Rajesh |

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా సిద్ధమైంది.

ఆ రెండు అంశాలపైనే స్పెషల్ ఫోకస్..! బీఆర్ఎస్ ఎన్నికల ఎజెండా ఫిక్స్?
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా సిద్ధమైంది. రాష్ట్రంలో దళితవాదం ప్రధాన ఎజెండాగా ఉండేలా కసరత్తు పూర్తిచేసింది. జాతీయ స్థాయిలో మాత్రం ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాన్ని ఫిక్స్ చేసుకున్నది. రాష్ట్రంలో ఇప్పటికే రైతు సంక్షేమమే ప్రధాన ఫోకస్‌గా రైతుబంధు, రైతుబీమా లాంటి స్కీమ్‌లు వినూత్నంగా అమలవుతున్నందున ఇక దళితబంధును హైలైట్ చేయాలని భావిస్తున్నది. ఇతర రాష్ట్రాల్లో మాత్రం రైతు కేంద్రంగానే పార్టీ విధానం, నినాదం ఉండేలా ప్లాన్ చేసుకున్నది. ఎన్నికల పూర్తయ్యే వరకూ రాష్ట్రానికి, కేంద్రానికి వేర్వేరు వ్యూహాలను పార్టీ నాయకత్వం ఫిక్స్ చేసుకున్నది.

రైతుబంధుతో రాష్ట్రంలో ఇప్పటికే పార్టీ రైతులకు చేరువైనందున.. దళితబంధుతో ఆ సెక్షన్ ప్రజలకు మరింత దగ్గర కావాలనే ఆలోచనతో ఈ ఎజెండాను ఖరారు చేసుకున్నట్టు సమాచారం. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కవ స్థాయిలో దళిత సదస్సులను నిర్వహించాలన్న నిర్ణయం పార్టీలో జరిగింది. మేధావులు, విద్యాధికులు, ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్తలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో సెమినార్లు, సమ్మేళనాలు నిర్వహించనున్నారు.

ఇందుకు సంబంధించి ప్రాథమికంగా వర్క్ డివిజన్‌ కూడా కొలిక్కి వచ్చినట్టు సమాచారం. గతేడాది నిధుల లేమి కారణంగా దళితబంధు ఆశించినంతగా అమలుకాలేదు. కానీ ఈసారి మాత్రం ఆ స్కీమ్‌కు ఫండ్స్ రిలీజ్ చేసేందుకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. గత బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం రూ.17,700 కోట్లు కేటాయించి సుమారు రెండు లక్షల మందికి తలా రూ.10 లక్షల చొప్పున సాయం అందించాలనుకున్నది. కానీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఈ ఏడాదీ అంతే మొత్తంలో ఈ స్కీమ్ కోసం బడ్జెట్‌లో వెచ్చించింది. మొత్తం 1.77 లక్షల మందికి ఈసారి సాయం అందించాలన్నది టార్గెట్. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీరియస్‌గానే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

దళిత ఓటు బ్యాంకుపై ఫోకస్

రైతుబంధు, రైతుబీమా స్కీమ్‌లతో ఆ సెక్షన్ ఓటర్లకు దగ్గరయ్యామనది బీఆర్ఎస్ ఆలోచన. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు సీఎం ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా క్షేత్రస్థాయిలో కొనసాగుతున్నది. అది కొలిక్కి వచ్చిన తర్వాత సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడమా? లేక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చెక్కుల రూపంలో అందించడమా? అనేది ఖరారు కానున్నది. ఎన్నికలు దగ్గర పడే సమయానికి చెక్కుల ద్వారా పరిహారం అందిస్తే అది ఓటు బ్యాంకుకు ఉపయోగపడుతుందని లోకల్ ఎమ్మెల్యేల అభిప్రాయం. కానీ దీనిపై ఇంకా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

గత హామీలతో నెగెటివ్?

దళితుడే సీఎం... పేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూపంపిణీ వంటివి అమలుకాకపోగా దళితులపై అధికార పార్టీ నేతల అకృత్యాలు లాంటి ఆరోపణలు ఆ సెక్షన్ వర్గాల్లో నెగెటివ్ అవుతున్నదనే అభిప్రాయం బీఆర్ఎస్‌లో వ్యక్తమవుతున్నది. గతేడాది దళితబంధును ప్రయోగాత్మకంగా హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా ఆర్భాటంగా ప్రకటించినా ఆ ఎలక్షన్ లో గెలవలేకపోయింది. రైతుబంధు తరహాలో దళితబంధు సక్సెస్ కాలేదనేది ఆ పార్టీ నేతల జనరల్ టాక్.

ఇప్పటివరకు సుమారు నాలుగు వేల కోట్లకు పైగానే దళితబంధు కోసం ఖర్చు పెట్టినా అనుకున్నంత మైలేజ్ రాలేదు. రైతుబంధు మునుగోడు ఎన్నికల్లో పాజిటివ్ రిజల్టు తెచ్చిందని పార్టీ భావిస్తున్నది. ఈసారి ఎన్నికల సమయంలో దళితబంధు ద్వారా ఓటు బ్యాంకును కైవసం చేసుకోవాలని ప్లాన్. ఈ ఏడాది అన్ని నియోజకవర్గాల్లో అమలుపై పోకస్ పెట్టి ఎన్నికల ప్రచారం సమయానికి విజిబుల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నది. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ గ్రాండ్‌గా నిర్వహించాలనుకుంటున్నది.

అంబేద్కర్ పేరుతోనూ ప్రోగ్రామ్స్

అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం, సచివాలయానికి ఆయన పేరు పెట్టడాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. విగ్రహావిష్కరణకు అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్‌ను ఆహ్వానించడంతో పాటు రాష్ట్రంలోని పలు దళిత సంఘాలతో సమావేశాలను ఏర్పాటు చేసి ఆ నేతల ఆధ్వర్యంలో సదస్సులు, సమ్మేళనాలు జరిగేలా ప్లాన్ చేస్తున్నది. అన్ని నియోజకవర్గాల నుంచి జనాలను అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించడం, వారికి రానుపోను రవాణా ఏర్పాట్లతో పాటు భోజన, వసతి సౌకర్యాలను కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది.

ప్రభుత్వ ప్రోగ్రామ్‌ను పార్టీకి మైలేజీ వచ్చేలా చూసుకోవడంతో పాటు ఇకపైన అంబేడ్కర్ పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహించేలా ఆలోచన చేస్తున్నది. ఎన్నికల వరకూ అంబేడ్కర్‌ను హీరోగా డిస్‌ప్లే చేయాలనుకుంటున్నది. అంబేడ్కర్ ఆలోచనా విధానంతో ఏకీభవిస్తున్నవారిని గుర్తించి వారి ఆధ్వర్యంలో విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లోకి తీసుకెళ్లాలా ప్లాన్ జరుగుతున్నది. మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, విద్యావంతులను కూడా ఇందులో భాగస్వాములను చేయాలనుకుంటున్నది.

ఇతర రాష్ట్రాల్లో రైతు నినాదం

రైతుబంధు, రైతుబీమా పథకాలను ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో మోడల్ స్కీమ్‌లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొజెక్ట్ చేసుకున్నది. మీడియాకు భారీ స్థాయిలో వాణిజ్య ప్రకటనలు ఇచ్చింది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు సంఘీభావాన్ని ప్రకటించింది. ఢిల్లీ సరిహద్దులో జరిగిన ఆందోళనల్లో చనిపోయిన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయాన్ని సీఎం కేసీఆర్ అందించారు. రైతులు చట్టసభల్లోకి రావాలన్నదే బీఆర్ఎస్ పాలసీ అంటూ దేశమంతా ప్రచారం చేశారు.

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దీన్నే హైలైట్ చేయాలనుకుంటున్నారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతు నినాదాన్నే పాపులర్ చేయనున్నారు. ఇప్పటివరకు బీఆర్ఎస్‌లో చేర్చుకున్నవారికి కూడా తెలంగాణ రైతు స్కీమ్‌ల గురించే వివరించారు. బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో తొలుత ఫోకస్ పెట్టి జాతీయ స్థాయిలో మొదట కిసాన్ యూనిట్లనే ప్రారంభించారు. గుర్నామ్‌సింగ్‌కు కిసాన్ విభాగం బాధ్యతలను అప్పగించారు. మహారాష్ట్రలో సైతం నాసిక్, నాగ్‌పూర్, ఔరంగాబాద్, నాందేడ్ తదితర బ్లాకులకు కిసాన్ యూనిట్ బాధ్యులను నియమించారు. తెలంగాణలో, ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ ఎలాంటి వ్యూహం ఏ తీరులో అవలంబిస్తారన్నది కీలకం కానున్నది.

Next Story