రైల్వే ట్రాక్‌లపై భద్రతకు స్పెషల్ డ్రైవ్: సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆదేశం

by Vemula.Srinu Prasad |

రైలు ప్రమాదాల నివారణే ధ్యేయంగా పశువులు పట్టాలపైకి రాకుండా ఉండేందుకు అన్ని డివిజన్ల పరిధిలో ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, కందకాలు, రక్షణ కంచెలు (ఫెన్సింగ్) వంటి నివారణ చర్యలు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. ...

రైల్వే ట్రాక్‌లపై భద్రతకు స్పెషల్ డ్రైవ్: సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైలు ప్రమాదాల నివారణే ధ్యేయంగా పశువులు పట్టాలపైకి రాకుండా ఉండేందుకు అన్ని డివిజన్ల పరిధిలో ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, కందకాలు, రక్షణ కంచెలు (ఫెన్సింగ్) వంటి నివారణ చర్యలు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలను నివారించేందుకు రైల్వే ట్రాక్ సమీప గ్రామస్తులను చైతన్యపరిచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో సోమవారం అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, వివిధ విభాగాల ప్రధానాధికారులతో కలిసి జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రతపై ఆయన సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లకు చెందిన డీఆర్‌ఎంలు, వారి బృందాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రైళ్ల నిర్వహణను మరింత సురక్షితంగా మార్చే దిశగా, లోకో పైలట్లకు సిగ్నల్ సూచనలు అత్యంత స్పష్టంగా కనిపించేలా ప్రత్యేక కార్యాచరణ (స్పెషల్ డ్రైవ్) చేపట్టాలని అధికారులకు జీఎం దిశానిర్దేశం చేశారు. రైళ్ల రాకపోకలు సజావుగా సాగేందుకు ట్రాక్‌ల నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ అత్యవసరమన్నారు. ఈ నెలలో అధికారులు, సూపర్‌వైజర్లు నిర్వహించిన భద్రతా తనిఖీల సారాంశాన్ని ఆయన సమీక్షించారు.

వర్షాకాలంలో ట్రాక్‌లపై అప్రమత్తత అవసరం...

ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సెక్షన్లలో, ట్రాక్‌లలో అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, సూపర్‌వైజర్లందరికీ జీఎం సూచించారు. భద్రతా పనులు నిర్వహించే సమయంలో పనిజరిగే ప్రదేశాలలో ప్రమాణాలను కచ్చితంగా పాటించడంతో పాటు, వివిధ విభాగాల మధ్య సమన్వయం సజావుగా ఉండటం ప్రాముఖ్యమని పునరుద్ఘాటించారు. రైళ్ల నిరాటంకమైన రాకపోకలు, ప్రయాణీకుల భద్రతను కాపాడటానికి తనిఖీల సమయంలో గమనించిన ఏవైనా చిన్నపాటి లోపాలను సైతం తక్షణమే సరిదిద్దాలని ఆదేశించారు. రైలు నిర్వహణలో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు.

Next Story