వసతిగృహాల్లో నాలుగేళ్లుగా స్పెషల్ డైట్‌ బకాయిలు

by Malleboina Mahesh |

తెలంగాణ వసతిగృహాల్లో నాలుగేళ్లుగా నిలిచిపోయిన పదో తరగతి 'స్పెషల్ డైట్' నిధులు.. అప్పులు తెచ్చి వెండర్లకు చెల్లిస్తున్న హెచ్‌ఎంలు, వార్డెన్లు!

వసతిగృహాల్లో నాలుగేళ్లుగా స్పెషల్ డైట్‌ బకాయిలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, ప్రీ-మెట్రిక్ వసతి గృహాల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్పెషల్ డైట్‌‌ను ప్రవేశపెట్టింది. అయితే కాగితాల్లో ఉత్తర్వులు ఇస్తున్నా.. క్షేత్రస్థాయికి మాత్రం డబ్బులు రావడం లేదు. ఫలితంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతిగృహ సంక్షేమ అధికారులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అప్పులు తెచ్చి మరీ స్పెషల్ డైట్ మెయింటెన్ చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

80 రోజుల ఖర్చు.. 60 రోజులకు చెల్లింపులు..

పదో తరగతి విద్యార్థులకు జనవరి నెల నుంచి పరీక్షలు పూర్తయ్యేవరకు (సుమారు 80 రోజులకు పైగా) ప్రత్యేక పౌష్టికాహారాన్ని అందించేలాని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.20 చొప్పున కేటాయించింది. ఈ బడ్జెట్‌తో ఉదయం బూస్ట్, మధ్యాహ్నం పల్లిపట్టి (చిక్కీ) లేదా ఏదైనా ఒక పండు, రాత్రి వేళల్లో చదువుకునే సమయంలో టీ, బిస్కెట్లు అందించాల్సి ఉంటుంది. గతంలో 2021-22 విద్యా సంవత్సరం వరకు సంక్షేమ శాఖల కమిషనర్‌ల నుంచి కేవలం 60 రోజులకు మాత్రమే సంబంధించిన బిల్లులు జిల్లా అధికారుల బ్యాంకు ఖాతాలకు వచ్చేవి. జిల్లా అధికారులు వాటిని విద్యార్థుల సంఖ్యను బట్టి ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, వసతిగృహాల అధికారులకు చెక్కుల రూపంలో చెల్లించేవారు.

ఒక్కొక్కరు సుమారు రూ.లక్ష వరకు..

2022-23 విద్యా సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఈ స్పెషల్ డైట్ చార్జీల చెల్లింపులు పెండింగ్‌లో పడిపోయాయి. గత నాలుగు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని ప్రధానోపాధ్యాయులు, వసతిగృహాల అధికారులు వాపోతున్నారు. గడిచిన 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు సంబంధించి నిధుల విడుదలకు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ డబ్బులు మాత్రం రాలేదని అంటున్నారు. ప్రభుత్వం బిల్లులు ఆపేసినా, విద్యార్థులకు డైట్ ఆగకుండా ఉండేందుకు క్షేత్రస్థాయి అధికారులు శ్రమిస్తున్నారు. పాఠశాలలకు నిత్యావసరాలు సరఫరా చేసే వెండర్లకు తామే వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తూ సొంత డబ్బులు చెల్లిస్తున్నారు. ఒక్కో ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్ సుమారు లక్ష రూపాయల వరకు తమ సొంత జేబుల నుంచి, అప్పులు తెచ్చి వెండర్లకు చెల్లించాల్సి వస్తుంది. దీంతో క్షేత్రస్థాయి అధికారులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.

జాప్యం ఎందుకు?..

విద్యార్థుల పౌష్టికాహారం, విద్యా ప్రమాణాల పెంపుదల కోసం తాము పని చేస్తుంటే.. దానికి అనుగుణంగా నిధులు విడుదల చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని బాధిత ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న స్పెషల్ డైట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, తమను ఆర్థిక భారం నుంచి గట్టెక్కించాలని ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు, హాస్టళ్ల వార్డెన్లు, అధికారులు కోరుతున్నారు.

Next Story