- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శివరాత్రి స్పెషల్ బస్సులు సిద్ధం.. టికెట్ ధరల పెంపు!
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా టీవీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా టీవీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2243 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి కాగా.. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. ప్రధానంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71 తో పాటు రాష్ట్రంలోని కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు 273 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. పలు ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీరుతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను సంస్థ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను పెంచనున్నారు.
1.5 రెట్లు టికెట్ ధరల సవరణ
1.5 రెట్ల వరకు టికెట్ ధరలను సవరించింది. రెగ్యులర్ సర్వీసుల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ నెల 14 నుంచి 16 తేదీ వరకు (మూడు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ చార్జీలు అమల్లో ఉంటాయి. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 15 వ తేదీ నుంచి 17 తేదీ వరకు సవరణ చార్జీలు వర్తిస్తాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డు లను సంస్థ ఏర్పాటు చేస్తుంది. శివరాత్రి ఆపరేషన్స్ పై ఉన్నతాధికారులతో సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి సమీక్ష నిర్వహించారు. శివరాత్రి పండుగకు శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లను చేస్తోంది. గత శివరాత్రి కన్నా ఈ సారి 208 బస్సులను అదనంగా సంస్థ నడపనుంది.
రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు..
భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు రాష్ట్రంలో ప్రయాణానికి ఉచిత బస్సు రవాణా సదుపాయం యధావిధిగా అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించామని, టికెట్ల బుకింగ్ ను www.tgsrtcbus.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని, మహా శివరాత్రి స్పెషల్ బస్సులకు సంబంధించిన సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-234500332లలో సంప్రదించవచ్చని తెలిపారు.






