నోటికి ఎంతొస్తే అంత మాట.. చేతికొస్తే కొట్టుడు.. ఆసుపత్రుల్లో పెరుగుతున్న గొడవలు!

by Gantepaka Srikanth |   (  Updated:2026-06-08 08:32:03  IST  )

హాస్పిటల్‌కి వెళ్లేది గొడవ పడేందుకు కాదు.. ప్రాణాలను కాపాడుకునేందుకు కొట్టుమిట్టాడుతున్న మనోళ్లను బతికించుకునేటందుకు.

నోటికి ఎంతొస్తే అంత మాట.. చేతికొస్తే కొట్టుడు.. ఆసుపత్రుల్లో పెరుగుతున్న గొడవలు!
X

దిశ, ఫీచర్స్: హాస్పిటల్‌కి వెళ్లేది గొడవ పడేందుకు కాదు.. ప్రాణాలను కాపాడుకునేందుకు కొట్టుమిట్టాడుతున్న మనోళ్లను బతికించుకునేటందుకు. కానీ మనలో చాలా మంది హాస్పిటల్‌లో అడుగుపెట్టుడే నెగెటివ్ మైండ్ సెట్‌తో పెడతారు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ డాక్టర్లు, నర్సులపై చేయి చేసుకుని.. రచ్చ చెయ్యాలనే ఆలోచనతో ఉంటారు. ఇక్కడ మనకు కావాల్సింది నిండు ప్రాణమా? పనికిమాలిన పంచాయతా?

అవకాశం దొరికితే గొడవేనా?

జనాలకు ఈ మధ్య ఎక్కడకు వెళ్లినా గొడవ చేయడం బాగా అలవాటైపోయింది. ప్రశాంతత కోసం వెళ్లే గుడిలో క్యూ లైన్ గురించి.. ఏం చదువు చెప్తున్నరని స్కూల్‌లో... ఆఖరికి అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని వెళ్లే హాస్పిటల్స్‌లో అవకాశం దొరికితే లొల్లి పెట్టుకొని రచ్చ చేయాలని చూస్తుంటరు. ఒకరిని చూసి ఒకరు ఇలాగే చేస్తున్నరు. తెలివిగా ఉండాల్సిన చోట తల తిక్కగా మాట్లాడుతూ వాళ్ల ఈగో శాటిస్‌ఫాక్షన్ కోసం ఇంకొకరి ప్రాణం పోయినా సరే అన్నట్లు ప్రవర్తిస్తున్నరు. సమస్యను సద్దుమణిగేలా చేయవల్సినోళ్లే చిన్న విషయాన్ని పెద్దగ చేస్తుంటరు.

కారణం ఏదైనా డాక్టర్ పైనేనా?

నిన్న మొన్న మన మధ్యలోనే ఉన్న మనిషి అకస్మాత్తుగా చనిపోయాడని తెలిస్తే ఎవరికైనా బాధనిపిస్తుంది. తట్టుకోలేం కూడా. ఆ బాధలో ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో తెలియదు. దరిద్రానికి అదే టైంలో డాక్టరో, నర్సో కనిపిస్తే అంతే సంగతి. చేతికేది దొరికితే దానితోని దాడి చేస్తం. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడి నానా హంగామా చేయడం చాలనే చూస్తుంటం. అదే పెద్ద ఇష్యూ అయిపోతది. కారణమేదైనా తప్పు డాక్టర్ మీదే వేయకుండా అసలేం జరిగిందో ఆలోచించే మనసుంటే ఎవరికీ ఏ నష్టమూ జరగదు.

ఏం జరిగినా కొట్టడమేనా?

రాజస్థాన్లోని ఉదయ్‌పూర్.. జేపీ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌లో కులదీప్ జైన్‌ను జాయిన్ చేశారు. అదొక యాక్సిడెంట్ కేస్. ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది. అప్పటికే చాలా టైం అయ్యింది. కానీ పేషెంట్‌కి స్పృహ రాలేదు. చనిపోయాడని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఈ విషయం డైజెస్ట్ చేసుకోలేని పేషెంట్ బంధువులు.. ఫ్యామిలీ మెంబర్స్.. మొత్తం ఓ 300 మందిదాక హాస్పిటల్‌లోకి దూసుకొచ్చారు. వస్తూ వస్తూనే ‘డాక్టర్ ఎక్కడ.. ఎవ్వడ్రా వాడూ’ అంటూ దాడికి దిగారు. ఆపరేషన్ థియేటర్‌ను పగలగొట్టి నానా రచ్చ చేశారు. ఎదురొచ్చిన సిబ్బందిపై.. చికిత్స చేసిన ముగ్గురు డాక్టర్లపై దాడి చేశారు. గాయపరిచారు.

సముదాయించినా కొట్టుడేనా?

జేపీ ఆర్థోపెడిక్ హాస్పిటల్ గొడవ బయట అందరికి తెలిసిపోయింది. విషయం తెలుసుకున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాజస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ గుప్తా వచ్చాడు. కానీ ఆయన చుట్టూమూగిన 30 మంది ఆయనను దారుణంగా కొట్టారు. ఒంటిమీద బట్టలు చింపేసి చిందరవందర చేశారు. హాస్పిటల్ నుంచి రోడ్డుమీదికి లాక్కునిపోయి దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. డాక్టర్లు మండిపడ్డరు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతోమందికి ప్రాణం పోస్తున్న డాక్టర్లను కొడుతరా అని నిరసన చేపట్టారు.

హాస్పిటల్ అంటే ఏంటి అసలు?

ఒక్క జేపీ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌లో జరిగిన ఘటన కాదిది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట పేషెంట్ల ప్రాణాలు పోవడం.. హాస్పిటల్ మీద దాడి చేయడం జరుగుతూనే ఉంటాయి. ఐతే.. ఇక్కడ ‘డాక్టర్లదేం తప్పులేదు.. వాళ్లంతా కరెక్టే చేస్తున్నరు’ అని చెప్తలేం. కానీ కారణమేదైనా డాక్టర్ల మీద దాడి చేసుడు కరెక్టేనా? ఒక పేషెంట్ ప్రాణం పోయిందంటే అందులో మన తప్పేం లేదా? ‘వద్దు బాబూ’ అని డాక్టర్లు ఎంత మొత్తుకున్నా వినకుండా మీద మీద పడుతూ అడ్మిట్ చేసిన ఘటనలెన్ని చూస్తలేం? చేసేదంతా చేసి మళ్లీ డాక్టర్ల మీదికే ఉల్టా దాడి చేసుడేంది?

డాక్టర్లను కొట్టుడే పరిష్కారమా?

వద్దన్నా చేర్చుకోవాలని ఒత్తిడి చేస్తం. గ్యారెంటీ ఇవ్వమని చెప్పినా.. కాళ్లా వేళ్లా పడి చేరుస్తం. దేనికైనా ఓకే అని సంతకం కూడా చేస్తం. మన అగ్రిమెంట్ ప్రకారం వాళ్ల ప్రయత్నమేదో వాళ్లు చేస్తరు. ఏ డాక్టరైనా చేజేతులా పేషెంటుని చంపాలని చూడరు కదా? కార్పొరేట్ మోసం చేసి మన దగ్గర పైసలు ఎక్కువ లాగాలని చూస్తరేమో.. కొన్నిసార్లు చనిపోయిన మనిషిని బతికిస్తమని చెప్తరు.. బతికున్న మనిషిని చనిపోయాడని చెప్తరు.. అలాంటి పరిస్థితుల్లో కోపం రావడం.. దాడి చేయడం ఓకే. కానీ అన్ని సందర్భాలలో, అన్ని కేసులలో దాడి చేసుడే కరెక్టు కాదుగా? డాక్టర్లను కొట్టడమే పరిష్కారం కాదుగా?

మన తప్పేం లేనట్టా?

కొంతమంది ఉంటారు. మనిషి బతికున్నప్పుడు అస్సలు పట్టించుకోరు. ఏదో నామమాత్రంగా అయితే హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తరు. వంతులు పెట్టుకొని వచ్చి చూస్తరు. ‘మందులు కావాలి’ అని అడిగితే.. అన్న తెస్తాడని తమ్ముడు.. తమ్ముడు తెస్తాడని అన్న చెప్తాడు. సమయానికి మందులేస్తేనే కదా పేషెంటు కోలుకునేది. అలాగే ఆపరేషన్ చేయాల్సి వస్తే ‘ఎంత ఖర్చు అవుద్ది. ఎందుకంత మనీ. మా వల్ల కాదేమో’ అని పది రకాల మాటలు మాట్లాడుతరు. వాళ్లూ వీళ్లూ అనేసరికి బుద్ధొచ్చి సరే అని అంటారు. కానీ అప్పటికే ఆలస్యమైతే? పేషెంట్ ఆరోగ్య పరిస్థితి ఆపరేషన్‌కు సహకరించకపోతే? డాక్టర్ తప్పే అవుతుందా?

చికిత్సనా? చిల్లర గొడవలా?

సకాలంలో స్పందించడం డాక్టరొక్కడే చేయాల్సిన పనా? మనకూ ఆ బాధ్యత లేదా? సకాలంలో హాస్పిటల్‌‌కు తీసుకు రావడం.. సకాలంలో ట్రీట్మెంట్ చేసేందుకు సహకరించడం.. సకాలంలో మందులు తేవడం మన బాధ్యతే కదా? మనం వాటిని నిర్లక్ష్యం చేసి తప్పు మాత్రం డాక్టర్‌దే అనడం ఎంతవరకు కరెక్ట్? నాణ్యమైన వైద్యం అందాలంటే ముందుగా మన సహకారం ఉండాలి. చిన్నదానికి పెద్దదానికి ఆలోచించి.. సమయానికి స్పందించకుండా.. పేషెంట్‌ దగ్గరికిపోయి పేషెన్స్ కోల్పోతం. పరిస్థితేంటో తెల్సుకోకముందే దాడి చేస్తాం. అక్కడ మనకు కావాల్సింది చికిత్సనా? చిల్లర చిల్లర గొడవనా?

ఆసుపత్రిలో ఆవేశమెందుకు?

పేషెంటుకు మంచి ట్రీట్మెంట్ అందించడం, బతికించుకోవడం మన బాధ్యత అయినప్పుడు మన ఆలోచన కూడా పేషెంట్ కోణంలోనే ఉండాలి కదా? అయినా అత్యవసర సేవ కోసం వెళ్లి ఆసుపత్రిలో ఆవేశమెందుకు? డాక్టర్ నిర్లక్ష్యం కనిపిస్తే ముందే నిలదీయాలి. టెక్నాలజీ ఉంది.. సోషల్ మీడియా ఉంది. ఎక్కడేం జరిగినా భయపడకుండా చెప్పే స్వేచ్ఛ ఉంది. ఇన్ని ఉన్నాక కూడా దాడిజేసి మనమే దండించడం ఎందుకు? ట్రీట్మెంట్ బాగాలేదని ముందే గ్రహించి షిఫ్ట్ చేసే ఆలోచన చేయాలి కదా? మెరుగైన వైద్యం కోసం నిలదీయాలి గానీ.. పంచాయతీ పెట్టుకొని కుస్తీ పడొద్దు?

డాక్టర్లూ బాధ్యతగా ఉండాల్సిందే..

హాస్పిటల్స్ అంటే కొట్లాడి పైసలు వసూలు చేయొచ్చనే ఆలోచన వచ్చేటట్లు చేస్తుంటారు కొందరు. ప్రీ ప్లాన్డ్‌గా వ్యూహ రచన చేసి తప్పంతా డాక్టర్ మీద వేసి.. పైసలు లాగొచ్చనే బ్యాచ్ కూడా తయారైంది. కాబట్టి జనాలు, హాస్పిటల్స్ అంటే నిందించే అవకాశముంది.. ఫైటింగ్ చేసి పైసలు లాగొచ్చు అనే ఆలోచన నుంచి బయటకు రావాలి. మన పరిచయాలను, తెలివిని ఉపయోగించి మంచి వైద్యం చేయించుకోవాలి. డాక్టర్ ప్రొఫెషన్ బాధ్యతాయుతమైంది. కాబట్టి నమ్మకంతో వచ్చిన వ్యక్తుల ప్రాణం కాపాడి పంపించాలి కానీ.. పైసల కోసం ఆశపడి ప్రాణం తీసి పంపించొద్దు డాక్టర్ మహాశయులు.

ప్రాణం ముఖ్యం.. పైసలు కాదు..

దవాఖానలో ఎక్కువ గొడవ వచ్చేది హాస్పిటల్ సిబ్బందితోనే. చిన్న చిన్న సేవలకు కూడా సతాయిస్తరు. ఇంజెక్షన్ కావాలని అడిగితే ఆగు అంటరు. గట్టిగా అడిగితే గొడవ పడతరు. చిన్న విషయాన్ని పెద్దది చేసి రచ్చ చేస్తుంటరు. మనమేమో డబ్బులు కడుతలేమా అనే ఫీలింగ్‌తో ఉంటం. ఒకవేళ అది సర్కారు ఆస్పత్రి అయితే జీతం తీసుకుంటలేరా అనిపిస్తుంటుంది. ఇలాంటి వాళ్ల వల్ల ముందు వ్యవస్థ మీద కోపమొస్తుంది. డాక్టర్ల మీద నమ్మకం తగ్గి ఫ్రస్టేషన్ ఎక్కువైపోయి గొడవ అవుతది. కాబట్టి కొన్నిసార్లు తప్పు సిబ్బందిదో, డాక్టర్‌దో అయినా సామరస్యంగా కూర్చుని మాట్లాడుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుంది.

ఏ డాక్టరూ సంతోషపడడు: పి. మహేందర్, ఉస్మానియా హాస్పిటల్

హాస్పిటల్‌ అందరిదీ. డాక్టర్ వృత్తి పవిత్రమైంది. రోగి బాధపడుతుంటే.. సంతోషపడే డాక్టర్లు ఉండరు. ఎక్కడో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ దాడి చేసుకోవడం, డాక్టర్లను కొట్టడమైతే కరెక్టు కాదు. సీరియస్ ట్రీట్మెంట్ నడుస్తుంటుంది. అటెండెంట్ ఎవరో నలుగురు ఐదుగురిని తీసుకొని వస్తాడు. దానివల్ల డిస్టర్బెన్సే గానీ ఎలాంటి లాభం ఉండదు. ఇక్కడే కథ స్టార్ట్ అవుద్ది. పెద్ద గొడవ జరిగి పరిస్థితి కొట్టుకునేదాక వెళ్తుంది.

బాధ్యతా భావం క్షీణిస్తోంది: రామ్ జె, నాగర్ కర్నూల్

హాస్పిటల్ సిబ్బంది అయినా.. పేషెంట్‌కు సంబంధించిన బంధువులు అయినా.. గొడవ పడేది రోగి చికిత్స విషయంలో కాదు. ఎవరో ఏదో అన్నారనీ వాళ్ల వాళ్ల ఈగో సంతృప్తి కోసం గొడవలు పెట్టుకుంటరు. దీనివల్ల ఏమవుతుంది? వీళ్ల గొడవ ఏమో గానీ అక్కడ పేషెంట్‌కు అసౌకర్యం కలుగుతుంది. ఇది ఒక్క హాస్పిటల్ సమస్య మాత్రమే కాదు. సొసైటీలో మన బాధ్యతా భావం క్షీణిస్తోంది అనే దానికి సంకేతం.

Next Story