జూన్ 10 నాటికి రాష్ట్రాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

by velandi.Saikiran |

జూన్ 10 నాటికి రాష్ట్రాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు
X

జూన్ 10 నాటికి రాష్ట్రాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యం

జూన్ 1 న కేరళను తాకనున్న రుతుపవనాలు

రాగల మూడు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

నల్గొండ జిల్లా వేములపల్లిలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత

దిశ, తెలంగాణ బ్యూరో: మే చివరివారం రాగానే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది పదిరోజులు ఆలస్యం కానున్నాయి. మే 28న కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు జూన్ 1 వ తేదీ నాటికి కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవనాలు కేరళను తాకడానికి రెండు రోజులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో జూన్ 5 నాటికి ఏపీని తాకనున్నాయి. జూన్ రెండో వారంలో జూన్ 10 వ తేదీ నాటికి తెలంగాణను తాకనున్నాయి. ఈ నేపథ్యంలో రుతుపవనాల రాక గతంలో కంటే పదిరోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గతేడాది మే 31 నుండి జూన్ 1 మధ్య రుతుపవనాలు తెలంగాణను తాకాయి. దేశంలో నైరుతి రుతుపవనాల గమనం రెండు, మూడు రోజుల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్ష్ద్వీప్ పరిసరాలు, అలాగే నైరుతి, తూర్పు-మధ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత విస్తరించేందుకు మార్గం సుగమమైంది. దీనివల్ల రానున్న రోజుల్లో వర్షాలు ఊపందుకోనున్నాయి.

మోస్తరు వర్షాలు:

రాష్ట్రంలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలతో పాటు, పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో గంటలకు 40 నుండి 50 కి.మీ వేగంతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అలాగే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో గురువారం అత్యధికంగా నల్గొండ జిల్లా వేములపల్లిలో 46.5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో 46.4, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 46.4, కుమరం భీం జిల్లా దహేగావ్ లో 46.4, నిజామాబాద్ జిల్లా ఆలూర్ లో 46.4, సూర్యాపేట జిల్లా గరిడే పల్లిలో 46.4, ఖమ్మం జిల్లా ఎంకూరులో 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Next Story